వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. ధాన్యం కొనుగోళ్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యానవన శాఖ సమీక్షా సమావేశంలో ధాన్యం కొనుగోళ్లలో బకాయిలంటూ జరుగుతున్న ప్రచారంపై జగన్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం 8వేల కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని అందులో 6వేల కోట్ల రూపాయలు చెల్లించిందని చెప్పారు. రైతులకు 2వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.
పెండింగ్ ఉన్న 2వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు రైతులకు ఉన్న బకాయిలను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుండి 4,500 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం అప్పు చేసి మరీ రైతులకు బకాయిలు చెల్లించడానికి సిద్ధమైందని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 4500 కోట్ల రూపాయలు రావాలన్న మాట చంద్రబాబు నోటి నుండి రాదని విమర్శలు చేశారు.
గతంలో చంద్రబాబు పెండింగులో పెట్టిన 960 కోట్ల రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. మే నెలలో రైతుభరోసా నిధుల్ని అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. రైతుభరోసా, అమ్మఒడి పథకాలకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి... అర్హులకు నగదు వెంటనే జమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
పులివెందులలో అరటి అనుబంధ ఉత్పత్తులకు ఒక సంస్థ, కోనసీమలో కొబ్బరికై ఆహార శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో మద్దతు ధరలు అమలవుతున్నాయో లేదో పరిశీలించి నివేదిక ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. మద్దతు ధరలు అమలు కాకపోతే మార్కెటింగ్ శాఖ ఉత్పత్తుల కొనుగోలు చేపట్టాలని సూచించారు. ఆయిల్ పామ్, కొబ్బరి తోటలలో తెల్ల దోమ విస్తరించడంపై జగన్ చర్చించారు. ఉద్యానవన శాఖ తెల్లదోమ నివారణకు అవసరమయ్యే పిచికారీలకు సహాయం అందించాలని సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేకరులకు వెల్లడించారు.