ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ 90,000 మందికి సోకగా 3,100 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా విజయవాడలో కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఒక వ్యక్తి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఆస్పత్రి సిబ్బంది రక్త పరీక్షలు చేసి రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. జర్మనీ నుండి విజయవాడకు ఇటీవలే ఈ వ్యక్తి వచ్చినట్టు సమాచారం. 
 
చైనాలోని వుహాన్ లో పుట్టి విస్తరిస్తున్న ఈ వైరస్ బాధితులను ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణలో గుర్తించగా ఇటలీ నుంచి వచ్చిన మరో 15మందికి వైరస్ సోకినట్టు సిబ్బంది గుర్తించారు. వీరిలో 14 మంది ఇటలీ దేశానికి చెందినవారు కాగా ఒకరు మాత్రం భారత్ కు చెందినవారని తెలుస్తోంది. వీరికి ఎయిమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స జరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. 
 
నిన్నటికి చైనాలో మృతుల సంఖ్య 2,981కి చేరింది. ఈ వైరస్ భారత్ తో పాటు ఇటలీ, ఇరాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ప్రధాని మోదీ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణలో కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. 
 
ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతోంది. కరోనా వైరస్ సోకిన బాధితుడికి ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. గాంధీ వైద్యులు కరోనా బాధితుడి పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3,000 బెడ్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు.                

మరింత సమాచారం తెలుసుకోండి: