తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం తెలంగాణలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదు కాగా తాజాగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆస్పత్రి వైద్యులు మరో ఇద్దరికి కరోనా సోకినట్లు గురించారు. గాంధీ మెడికల్ కాలేజీలోని ఐసీఎమ్ఆర్ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. వైద్యులు వారి బ్లడ్ శాంపిల్స్ ను పరిశీలన కోసం పుణెలోని ల్యాబ్ కు పంపారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలాజీ శాంపిల్స్ ను పరిశీలించి రేపు రిపోర్టులను అందించనుందని సమాచారం. పుణె ల్యాబ్ లో కూడా కరోనా పాజిటివ్ అని తేలితే అధికారికంగా ప్రకటన చేస్తారు. ఈ ఇద్దరిలో ఒకరు ఇటీవల ఇటలీకి వెళ్లి వచ్చిన వ్యక్తి కాగా మరొకరు కరోనా భారీన పడిన సాఫ్ట్ వేర్ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తి అని తెలుస్తోంది. వైద్యులు కరోనా భారీన పడిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెబుతున్నారు.
మరోవైపు ఏపీలో కరోనా అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో 11 కరోనా అనుమానిత కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. వైజాగ్ లో 5, శ్రీకాకుళంలో 3, కాకినాడ, విజయవాడ, ఏలూరులో ఒక్కో అనుమానిత కేసు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఐసోలేషన్ వార్డుల్లో కరోనా అనుమానితులకు చికిత్స జరుగుతోంది.
ప్రభుత్వం కరోనా అనుమానితులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందివ్వాలని సూచించింది. ఈరోజు ఏపీ సచివాలయంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో మల్టీ సెక్టోరల్ కో ఆర్డినేషన్ సమావేశం జరిగింది. వివిధ శాఖల ఉన్నతాధికారులు, అదనపు సీఎస్ ఈ సమావేశంలో పాల్గొని కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.