కొన్ని రోజుల క్రితం ఏపీలోని కర్నూలు ఓటర్ల జాబితాలో హీరో వెంకటేష్ ఫోటో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఒక మహిళ ఫోటో బదులు హీరో ఫోటో ప్రింట్ అవ్వడంతో షాక్ అవ్వడం ఓటర్ల వంతయింది. గతంలో కూడా స్టార్ హీరోయిన్ల ఫోటోలు ఓటర్ కార్డులలో ప్రింట్ అయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఇలాంటి విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. 
 
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలోని రామ్ నగర్ గ్రామంలో ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ఒక వ్యక్తికి కుక్క ఫోటోతో కూడిన ఓటర్ గుర్తింపు కార్డు వచ్చింది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో దరఖాస్తు చేసిన ఆయన కార్డులో తన ఫోటో బదులు కుక్క ఫోటో ఉండటంతో షాక్ కు గురయ్యాడు. వెంటనే ఉన్నతాధికారులకు జరిగిన తప్పు గురించి ఫిర్యాదు చేశాడు 
 
ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కొత్త గుర్తింపు కార్డును జారీ చేస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది చేసిన పొరపాటు వలన గుర్తింపు కార్డులో అతని ఫోటో బదులు కుక్క ఫోటో వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తామని అన్నారు. గుర్తింపు కార్డులో కుక్క ఫోటో రావడంతో  ఈ ఘటన వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు చేస్తున్నారు. 
 
ఓటర్ గుర్తింపు కార్డులో కుక్క ఫోటో రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో ఏపీలో కుక్క ఫోటోతో ఓటరు కార్డును ముద్రించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలోకి కుక్క ఫోటో ఎలా వచ్చింది..? పరిశీలించకుండానే ఓటర్ కార్డు ముద్రించేస్తారా...? ఇందుకు బాధ్యులెవరు..? ఇదేం పనితీరు...? అని కోర్టు విమర్శలు చేసింది. ఎన్నికల కమిషన్ ను దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే కోర్టు మొట్టికాయలు వేసినా ఎన్నికల అధికారుల పనితీరు మారకపోవడం గమనార్హం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: