నెల్లూరు జిల్లాకు చెందిన ఓ సాధారణ వ్యక్తి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడమే కాకుండా ఇప్పుడు ఉపరాష్ట్రపతి స్థానానికి వెళ్లడం నిజంగా తెలుగువారందరికీ దక్కిన గౌరవమనే చెప్పాలి. ఆ ఘనత సాధించిన వ్యక్తి ముప్పవరపు వెంకయ్య నాయుడు. బీజేపీ లో అగ్రనేత కొనసాగిన వెంకయ్య బిజెపి ఏపీలో ఎదిగేందుకు సహకరించకపోయినా, తెలుగుదేశం పార్టీకి మాత్రం ఎప్పుడు అండగా ఉండేవారు. చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ భరోసా ఇచ్చేవారు. ఈ వ్యవహారాన్ని గమనించే మోదీ, అమిత్ షా వంటి వారు వెంకయ్య హవా తగ్గించేందుకు ఆయనకు రాజ్యాంగపరమైన పదవిని కట్టబెట్టారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకోకపోయినా, తెలుగుదేశం పార్టీకి మేలు చేసే విధంగా ఏదో ఒక ప్రయత్నం అయితే ఆయన చేస్తూనే ఉన్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువు తీరడం వెంకయ్యకు ఏ మాత్రం ఇష్టం లేదన్న సంగతి అయన చేష్టల ద్వారా తెలుస్తూనే ఉంది. ఏపీలో ధాన్యం సేకరణ, కొనుగోలు వ్యవహారంపై ఏపీ అధికారులతో వెంకయ్య మాట్లాడారు. ఈ విషయం వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నేరుగా ఇలా వెంకయ్యరంగంలోకి దిగి అధికారులతో మాట్లాడ్డం పై జగన్ నొచ్చుకున్నారు. దీంతో వైసీపీ మంత్రులు వెనకయ్యను ఉద్దేశించి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆ లేఖలో ఏముందంటే... ధాన్యం సేకరణ చెల్లింపుల వ్యవహారం రాష్ట్ర పరిధిలోని అంశమే అయినా...దానిపై మీరు తీసుకున్న చొరవ రాష్ట్రానికి మంచి చేస్తుందని భావిస్తున్నాము. తెలుగు ప్రజలపై మీరు ప్రత్యేక అభిమానం చూపించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఉపరాష్ట్రపతి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీ అభివృద్ధి విషయంలో చూపిస్తున్న శ్రద్ధ కు ధన్యవాదాలు అంటూ ప్రశంసిస్తూనే... ధాన్యం విషయంలో స్పందించినట్లు గా కేంద్రం నుంచి రావాల్సిన 4724 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్, పునరావాసంకోసం నిధులు ఇప్పించవలసిందిగా వెంకయ్యకు కాస్త వెటకారంగా వైసీపీ మంత్రులు లేఖ రాశారు.