కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరవేసిన సంఘటన లో పోలీసులు రేవంత్ రెడ్డితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. లోక్ సభ సమావేశాలకు హాజరై ఢిల్లీ నుండి శంషాబాద్ విమానశ్రయంకు చేరుకున్న వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
పోలీసులు ఈ ఘటనలో రేవంత్ రెడ్డి, రాజేష్, శివ, ఓం ప్రకాష్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ప్రవీణ్ పాల్ రెడ్డి, విజయసింహా రెడ్డి, కృష్ణారెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 187, 184, రెడ్ విత్ 5ఏ, 11ఏ, ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డిని డ్రోన్ ఘటన గురించి విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డిలకు పోలీసులు ఇదివరకే నోటీసులు జారీ చేశారు. 
 
నోటీసులకు స్పందించకపోవడంతో అరెస్ట్ చేశారు. రేవంత్ అతని అనుచరులపై ఆరు పేజీలతో కూడిన ఎఫ్.ఐ.ఆర్ ను కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ ప్రాపర్టీలో అక్రమంగా డ్రోన్లు ఎగురవేసినందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి ఆదేశాల మేరకే డ్రోన్ ను ఎగురవేసినట్లు పోలీసులు ఇప్పటికే తేల్చారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి మిత్ర మండలి సభ్యులు, అనుచరులు, అభిమానులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ వైపు వెళుతున్నారు. 
 
ఎటువంటి అనుమతులు లేకుండా రెండు రోజుల క్రితం మియా ఖాన్ గూడ వద్ద డ్రోన్ కెమెరాలు ఉపయోగించడంతో ఈ కేసు నమోదైంది. పోలీసులు విచారణ అనంతరం నిందితుడుగా తేలడంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పరిధిలో డ్రోన్ కెమెరా వినియోగంపై నిషేధం ఉంది. పోలీసులు ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: