తిరుమలలోని వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రోజురోజుకీ పెరుగుతుంది. టీటీడీ వార్షిక బడ్జెట్ కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ఫలితంగా మిగులు తగ్గిపోతోంది. గతంలో ఏడాదికి 700 కోట్ల రూపాయల వరకూ డిపాజిట్లు చేసిన టీటీడీ... ఇప్పుడు వంద కోట్లు జమ చేయడానికి కూడా ఇబ్బందిపడుతోంది. దీనికి కారణం ఏమిటి? ఆర్థిక క్రమశిక్షణ టీటీడీకి ఎంత వరకు అవసరం?
ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాదిగా తరలివస్తూంటారు భక్తులు. ప్రతి సంవత్సరం 3 కోట్ల మందికి పైగా భక్తులు తిరుమలకు తరలివసున్నారు. దీంతో హుండీలో భక్తుల వేసే కానుకల రూపంలో ఏడాదికి 13 వందల 50 కోట్ల రూపాయలు ఆదాయం వస్తోంది. అలాగే టీటీడీ చేసిన డిపాజిట్లపై వడ్డీ రూపంలో 857 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. శ్రీవారి ప్రసాదాలు విక్రయం ద్వారా 400 కోట్లు... దర్శన టికెట్ల విక్రయం ద్వారా మరో 245 కోట్ల రూపాయలు వస్తున్నాయి. స్వామికి భక్తులు సమర్పించిన తలనీలాలు విక్రయం ద్వారా 100 కోట్లు వరకు ఆదాయం లభిస్తోంది. ఇలా టీటీడీకి ఏడాదికి 3 వేల 310 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది.
శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే ఆదాయం పెరుగుతున్నా... ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఉద్యోగుల జీత భత్యాలకు 13 వందల 85 కోట్ల రూపాయల్ని వెచ్చిస్తోంది టీటీడీ. అలాగే ముడి సరుకుల కోనుగోలుకు 574 కోట్ల రూపాయలు... ఇంజనీరింగ్ పనులకు మరో 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిర్వహణకు 195 కోట్ల రూపాయల వెచ్చిస్తోంది టీటీడీ. అలాగే ధర్మప్రచారానికి 132 కోట్లు... గ్రాంట్లుగా వంద కోట్లు... ధూపధీప నైవేధ్యాలకు 50 కోట్లు... పెన్షన్ ఫండ్‌కి 75 కోట్లు... విద్యా సంస్థల నిర్వహణకు 142 కోట్లు... వైద్య విభాగానికి 180 కోట్లు... భధ్రతా విభాగానికి 189 కోట్లు... ఆసుపత్రుల నిర్వహణకు 207 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. ఇలా టీటీడీ వ్యయం 3 వేల 310 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇక ఈ ఏడాది మిగిలిన 100 కోట్ల రూపాయల్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది టీటీడీ.
వాస్తవానికి టీటీడీకి హుండీ ద్వారా వచ్చేఆదాయన్ని కార్పస్ ఫండ్‌గా ప్రకటించింది. దీని వల్ల హుండి ద్వారా వచ్చే ఆదాయాన్ని టీటీడీ ఖర్చు చేసే అవకాశం వుండదు. ఆ నిధులను టీటీడీ ఆస్తులుగా మార్చుకోవాలి. ఈ క్రమంలో హుండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తూ వచ్చింది. దీంతో ఇంత వరకూ 10 వేల కోట్ల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయం కూడా టీటీడీకి ప్రస్తుతం పెద్ద వనరులుగా మారింది.
టీటీడీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. 2011లో ఉద్యోగుల జీతభత్యాలు 300 కోట్లుగా ఉంటే... ఇప్పుడది 13 వందల 85 కోట్ల రూపాయలకు చేరింది. అలాగే, దేశ వ్యాప్తంగా ఆలయాలు, కల్యాణ మండపాల నిర్మాణంతో పాటు పలు ఆలయాలు టీటీడీ పరిధిలోకి వస్తుండడంతో వ్యయం పెరుగుతూ వస్తోంది. దీంతో ఆ ప్రభావం ఫిక్స్ డ్ డిపాజిట్లపై పడింది. 2015-16లో అత్యధికంగా 783 కోట్ల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు టీటీడీ అధికారులు. మూడేళ్లు తిరిగే సరికి అది 86 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది వంద కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు అధికారులు.
ఈ పరిస్థితుల్లో సంస్థకు ఆర్థిక క్రమశిక్షణ అవసరమంటూ పలు కీలక సూచనలు చేసింది టీటీడీ ఫైనాన్షియల్ కమిటీ. ముఖ్యంగా కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు ఆపాలని సూచించింది. అలాగే, ఉపయోగం లేని ఆస్తుల్ని అమ్మేయాలని తెలిపింది. కల్యాణ మండపాల నిర్మాణం కూడా ఆపాలని... కొత్తగా ఆలయాలను కూడా టీటీడీ పరిధిలోకి తీసుకోవద్దని సూచించింది. ప్రతి రెండేళ్ల ఒక సారి దర్శనం, వసతి గదులు రుసుము పెంచాలని, టీటీడీ బ్రాండ్‌ని వినియోగించుకోని బంగారు, వెండి డాల్లర్లు... మంగళ సూత్రాల విక్రయం ద్వారా ఆదాయం పెంచుకోవాలని సూచించింది.
ఇప్పటికే లడ్డు ప్రసాదంపై సబ్సిడిని తొలగించడడం వల్ల టీటీడీపై ఏడాదికి 240 కోట్ల రూపాయల భారం తగ్గింది. ఫైనాన్సియల్ సబ్ కమిటీ చేసిన సూచనల్ని కూడా అమలు చేయడం ద్వారా అనవసర ఖర్చుల్ని తగ్గించుకుంటూ... ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం తిరుమల తిరుపతి దేవస్థానంపై ఉంది.