టెక్నాలజీ యుగంలో మీడియా విస్తృతి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రధాన మీడియా అంటే ప్రింట్ మీడియాకు పోటీగా సోషల్ మీడియా పెరిగిపోయింది. ఇప్పుడు ఏ పత్రికదీ మీడియా రంగంలో గుత్తాధిపత్యం లేదు.. ఒక పత్రికనో , ఛానల్ నో నమ్మే రోజులు కానే కావు. పత్రికలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే నేతలకు వారి ఎత్తులు ఏమాత్రం పారడం లేదు.
ఏదైనా పత్రిక దురద్దేశంతో కథనం ఇస్తే.. వెంటనే దానిపై విశ్లేషణలు.. ఆ పత్రిక దురుద్దేశాలు.. ఎండగడుతూ సోషల్ మీడియాలో విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. వాటి రీచ్ ఎంత అన్నది పక్కకుపెడితే.. ఏవిషయమూ దాగే పరిస్థితే లేదు. ఇది ఒక విధంగా మంచిదే.. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాతో మరో చిక్కువచ్చి పడింది.
సోషల్ మీడియా కారణంగా పుట్టుకొచ్చే వదంతులు, ఫేక్ న్యూస్.. చాలా ఎక్కువయ్యాయి... కనిపించిందల్లా షేర్ చేస్తూ జనం కూడా వాటిని బాగా పాపులర్ చేసేస్తున్నారు. సాధారణ విషయాల్లో ఎలా ఉన్నా.. కరోనా వంటి వ్యాధుల సమయంలో ఇది చాలా ప్రమాదకరంగా మారనుంది. ఇదిగో కరోనా ఇలా వస్తుందట.. అదిగో కరోనా అలా వస్తుందట అంటూ వచ్చే ఫేక్ సమాచారం ఇప్పుడు సోషల్ మీడియా ను ముంచేస్తోంది.
అంతే కాదు.. ఫేక్ వీడియోలు సృష్టించిన ప్రజలను పిచ్చోళ్లను చేయడం కొంతమందికి శాడిజం లా తయారైంది. ఏది నిజమో.. ఏది ఫేకో అర్థం చేసుకోలేని జనం వాటిని విపరీతంగా సర్క్యులేట్ చేస్తూ ఈ భయాందోళనలకు తమ వంతు కారణం అవుతున్నారు. కరోనా వ్యాప్తి వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఇచ్చే అధికారిక సమాచారం మాత్రమే నమ్మడం విజ్ఞులైన జనం చేయాల్సిన పని. అలాగే సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అయ్యే పిచ్చి సమాచారం వ్యాపింప చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.