తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా టిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కంటే టిఆర్ఎస్ రేవంత్ రెడ్డి మధ్య పోరు తీవ్రతరం అయినట్టుగా కనిపిస్తోంది. మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ తో పాటు కెసిఆర్, కేటీఆర్ ను వ్యతిరేకిస్తూ వస్తున్న రేవంత్ వీలున్నప్పుడల్లా వారిని వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అసలు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఉన్న అతిపెద్ద శత్రువు కాంగ్రెస్ బీజేపీలు కాదు కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడే అన్నట్టుగా ఎప్పుడూ పరిస్థితులు ఉంటున్నాయి. టిఆర్ఎస్ పార్టీకి కూడా రేవంత్ ప్రధాన శత్రువు అన్నట్లుగా తెలంగాణలో రాజకీయ వ్యవహారం నడుస్తోంది. రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, టిఆర్ఎస్ అగ్ర నాయకులే తమ ప్రధాన టార్గెట్ అన్నట్లుగా రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తూ వస్తున్నారు.
తమకు ఏకు మేకులా తయారైన రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టాలని భావిస్తున్న టిఆర్ఎస్ అధిష్టానం గతంలో రేవంత్ భూ ఆక్రమణలకు పాల్పడినట్లుగా తగిన ఆధారాలను సంపాదించింది. దీంతో రేవంత్ వర్సెస్ టిఆర్ఎస్ యుద్ధానికి మళ్ళీ తెరలేచింది. రేవంత్ ఎక్కడా వెనుకడుగు వేయకుండా కేటీఆర్ ను టార్గెట్ చేసుకున్నారు. ఆయనకు చెందిన ఫామ్ హౌస్ ఆక్రమణ అని, నిబంధనలకు విరుద్ధంగా దాంట్లో భవనాలు కట్టారని, ఇలా రేవంత్ మీడియా ముందు హడావుడి చేస్తూ రేవంత్ రెడ్డి తన అనుచరుల ద్వారా డ్రోన్ కెమెరా సహాయంతో కేటీఆర్ ఫామ్ హౌస్ ను వీడియో తీయించారు. ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలతో వీడియో తీశారు అని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి ఆయన అనుచరులపై పోలీసులు కేసు పెట్టి రిమాండ్ కు పంపించారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డికి మద్దతు మాత్రం అంతంతమాత్రంగా ఉంది.
దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే కంటే సొంతంగా పార్టీ పెడితే బెటర్ అన్న సూచనలు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీజేపీలు ఉన్నా.. వాటి ప్రభావం అంతంత మాత్రమేనని, రేవంత్ కనుక పార్టీ పెడితే, కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తులంతా రేవంత్ పెట్టిన పార్టీలో చేరతారని, అప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా రేవంత్ పెట్టబోయే పార్టీ ఉంటుందని, అప్పుడే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.చాలా కాలంగా రేవంత్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది.