ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఖాతాలను ఏడుగురు మహిళలకు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ స్త్రీమూర్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ఖాతాల నుండి నిష్క్రమిస్తున్నట్లు తెలిపారు. మోదీ తన ట్విట్టర్ ఖాతాలో తాను కొన్ని రోజుల క్రితం చెప్పినట్లు సోషల్ మీడియా నుండి నిష్క్రమిస్తున్నానని అన్నారు. 
 
తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఏడుగురు మహిళలు వారి జీవిత ప్రయాణాన్ని ప్రజలతో పంచుకుంటారని చెప్పారు. ఖాతాలు అప్పగించిన ఏడుగురు మహిళలు వివిధ రంగాలలో విశేష కృషి చేశారని అన్నారు. లక్షల మంది ప్రజలలో ఏడుగురు మహిళల పోరాటం, ఆశయాలు స్పూర్తి నింపుతాయని తెలిపారు. వారి విజయాలను మనం సెలబ్రేట్ చేసుకుందాం అని మోదీ ట్వీట్ చేశారు. 
 
ఆ వెంటనే ఏడుగురు మహిళలు మోదీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారు చేస్తున్న సామాజిక సేవల గురించి పంచుకున్నారు. అయితే మోదీ ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్న ఒక మహిళకు నెటిజన్ ఒక విన్నపంలాంటి సవాల్ ను విసిరారు. అందుకు ఆ మహిళ ఇచ్చిన సమాధానం నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తింది. ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతాను చెన్నైకు చెందిన స్నేహా మోహన్ దాస్ కూడా నిర్వహించారు. 
 
స్నేహా మోహన్ దాస్ ఆకలితో అలమటిస్తున్న ఎంతో మంది పేదలకు ఫుడ్ బ్యాంక్ ఇండియా పేరిట భోజనం అందేలా చేస్తున్నారు. ఆకలి లేని సమాజ నిర్మాణం కోసం ఆమె కృషి చేస్తున్నారు. ఆమె మోదీ ట్విట్టర్ ఖాతాలో కనీసం ఆకలితో ఉన్న ఒక వ్యక్తికైనా ఆహారం పెట్టాలని ప్రజలను కోరారు. ఆ ట్వీట్ కు సమాధానంగా ధ్రువ్ సింగ్ అనే వ్యక్తి "దయచేసి ట్విట్టర్ పాస్ వర్డ్ చెప్పండి" అని అడిగారు. స్నేహ మోదీ ట్విట్టర్ ఖాతా నుండి "న్యూ ఇండియా... లాగిన్ అవ్వడానికి ప్రయత్నించండి" అని బదులిచ్చారు. స్నేహ సమయస్పూర్తితో జవాబు ఇవ్వడంతో నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: