ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో 9639 ఎంపీటీసీ స్థానాలకు, 660 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో పంచాయతీ ఎన్నికలు, మూడో దశలో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో నిన్న షెడ్యూల్ విడుదలయిన నిమిషం నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధానంగా గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జనసేనకు మంచి పట్టు ఉన్న జిల్లాలు. గత ఎన్నికల సమయంలో అన్ని జిల్లాలపై దృష్టి పెట్టి పవన్ గోదావరి జిల్లాల విషయంలో కొంత నిర్లక్ష్యం వహించారు.
గత కొంతకాలంగా పవన్ సినిమాల్లో నటిస్తున్నా రాజకీయాలకు కూడా తగినంత ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. నిత్యం ఎంతో మందిని కలుస్తూ రాష్ట్రంలోని ప్రధాన సమస్యల గురించి చర్చిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులు చిన్న పదవుల్లా అనిపించినప్పటికి రాబోయే రోజుల్లో అవే కీలకం అవుతాయి. అందుకే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలపై దృష్టి పెట్టాయి.
పవన్ కళ్యాణ్ కొన్నిరోజులు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ రెండు జిల్లాలలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఈ జిల్లాల నుండి ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని పవన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లాపై కూడా పవన్ దృష్టి పెట్టారని సమాచారం. ఈ మూడు జిల్లాలలో వైసీపీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించినా జనసేన రెండో స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.