టిడిపిలో ఉన్నా, బిజెపిలో చేరినా తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని ముగ్గురు రాజ్యసభ సభ్యులు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ చంద్రబాబు తర్వాత తామే అన్నట్లుగా అన్ని వ్యవహారాలను చక్కబెట్టే వారు. అంతేకాకుండా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అందరి మీద పెత్తనం చేసేవారు. కానీ గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు బిజెపి ఈ ముగ్గురు నేతలైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టి.జి.వెంకటేష్ లను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు చేయడంతో హడలెత్తి పోయిన వీరు అకస్మాత్తుగా టీడీపీని వదిలి బిజెపిలో చేరిపోయారు.
అలా చేరిన మొదట్లో బిజెపిలో వీరికి బాగానే ప్రాధాన్యత దక్కింది. ఇదే అవకాశంగా తీసుకుని సుజనా చౌదరి, సీఎం రమేశ్, ఇద్దరూ టీడీపీకి అనుకూలంగా ఏపీ వ్యవహారాల్లో తలదూర్చి, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ బిజెపి జగన్ కు దగ్గరవడం, చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుండటంతో వీరికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా బిజెపిలో కీలక నిర్ణయాలు అన్నిటినీ ఎప్పటికప్పుడు చంద్రబాబుకు చేరవేస్తూ, ఆయనకు మేలు జరిగేలా వ్యవహరిస్తుండడంతో వారిపై ఒక కన్నేసి ఉంచిన బీజేపీ అధిష్టానం ప్రస్తుతం ఆ ముగ్గురిని పక్కన పెట్టినట్లు గా వ్యవహరిస్తోంది.
అంతేకాకుండా ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. బిజెపి జనసేన కలిసి ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఏపీలో బీజేపీ తరఫున వీరు ప్రచారం నిర్వహించాల్సి ఉన్నా, పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనికి కారణం వీరికి ఎన్నికల బాధ్యతలను అప్పగించకపోవడమేనని తెలుస్తోంది. ఎందుకంటే చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించి ఆ పార్టీకి మైలేజ్ పెరిగేలా చేస్తారు తప్ప, బిజెపి విషయాన్ని వీరెవ్వరూ పెద్దగా పట్టించుకోరు అనే అనుమానంతో బీజేపీ అధిష్టానం వీరిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.