తాజాగా దేశ ఆర్ధిక రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎస్ బ్యాంకు దివాలా విషయం అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా ఎస్ బ్యాంకు దివాలా తీసింది అనగానే స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోయాయి. బ్యాంకులో కోట్ల రూపాయలు డిపాజిట్లుగా పెట్టిన ప్రభుత్వాలు, వివిధ సంస్ధలు ఒక్కసారిగా ముణిగిపోయాయి. అసలు ఈ బ్యాంకు దివాలా ఎందుకు తీసింది ? బ్యాంకు దివాలా తీయటం వెనుక ఉన్న బడా బాబులు ఎవరో తెలుసా ?
పంజాబ్ కు చెందిన రాణాకపూర్ అనే పారిశ్రామికవేత్త ఎస్ బ్యాంకును 2004లో ఏర్పాటు చేశాడు. ఓ పదేళ్ళ పాటు బ్యాంకు లావాదేవీలు బాగానే జరిగాయి. కానీ గడచిన ఐదేళ్ళల్లో జరిగిన అవకతవకల వల్ల అంటే 2020 కల్లా బ్యాంకు దివాలా తీసేసింది. 2014 నాటికి బ్యాంకు ఇచ్చిన అప్పుల మొత్తం రూ. 55 వేల కోట్లయితే 2020లో దివాలా తీసేనాటికి అప్పుల మొత్తం సుమారు రూ. 2.41 లక్షలకు చేరుకుంది. అంటే గడచిన ఐదేళ్ళల్లో ఇచ్చిన అప్పులే సుమారు రూ. 1.9 లక్షల కోట్లన్నమాట.
ఇక్కడ ఇంకో విచిత్రమేమిటంటే మొత్తం రూ. 2.41 లక్షల కోట్ల అప్పుల్లో రూ. 1, 45,068 కోట్లు పారుబకాయిలేనట. పారుబకాయిలంటే అప్పులు తీర్చగలిగే ఆర్దిక స్తోమత ఉండి కూడా అప్పులు తీర్చకపోవటం. అంటే ఇవన్నీ రానిబకాయిలన్నమాట. ఎస్ బ్యాంకు ఇచ్చిన రూ. 2. 41 లక్షల కోట్ల అప్పుల్లో ప్రధానంగా అనీల్ అంబానీకి చెందిన కంపెనీలు, జీ నెట్ వర్క్ అధిపతి సుభాష్ చంద్రతో పాటు డిహెచ్ఎఫ్ఎల్ లాంటి సంస్ధలున్నాయి.
కేంద్రంలో తమకున్న పలుకుబడి ఆధారంగా బ్యాంకులో వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. తిరిగి చెల్లించకుండానే వాళ్ళు దివాలా తీసినట్లు పిటీషన్ వేయటంతో వాళ్ళు తీసుకున్న అప్పులు చెల్లించాల్సిన అవసరమే లేదు. అలాగే దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డిహెచ్ఎఫ్ఎల్) సుమారు రూ. 4 వేల కోట్లు చెల్లించలేమంటూ దివాలా పిటీషన్ వేసింది. ఇటువంటి అనేక సంస్ధల వల్లే చివరకు లక్షలాది మంది ఖాతాదారుల నెత్తిన గుడ్డ పడింది. అంబానీ, డిహెచ్ఎఫ్ఎల్, జీ గ్రూపు లాంటి సంస్ధలకు ఒకచేత్తో వేల కోట్లు అప్పులిచ్చి మరో చేత్తో రాణాకపూర్ కుటుంబం వందల కోట్లు కమీషన్లు తీసేసుకోవటంతోనే చివరకు బ్యాంకు కుప్ప కూలిపోయింది.