ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం అధికారులతో చర్చించారు. గత పది రోజుల నుండి కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ప్రభుత్వ ముఖ్య అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. 
 
ఈ సమావేశం అనంతరం సీఎం జగన్ పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా అనిమానితుల సంఖ్య పెరుగుతూ ఉండటం, నెల్లూరులో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 
 
ప్రభుత్వం ఇప్పటికే నెల్లూరులో స్కూళ్లు, థియేటర్లు బంద్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో పూర్తి స్థాయిలో స్కూళ్లు, థియేటర్లు బంద్ చేయబోతున్నారని తెలుస్తోంది. వారం రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసింది. 
 
కరోనా లక్షణాలను నిర్ధారించేందుకు ప్రభుత్వం తిరుపతిలో ఒక ల్యాబ్, విజయవాడలో మరో ల్యాబ్ ద్వారా ఏర్పాటు చేసింది. ఎయిర్ పోర్టులలో స్క్రీనింగ్ టెస్టులు చేసిన తరువాత మాత్రమే ప్రభుత్వం ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతిస్తోంది. నెల్లూరు జిల్లా విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లతో పాటు మాల్స్ కూడా బంద్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.                      

మరింత సమాచారం తెలుసుకోండి: