తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందకుండా సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలను గుర్తించి అక్కడినుండి వచ్చే ప్రయాణికులను మూడు కేటగిరీలుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైనాలోని వుహాన్ లో ప్రారంభమైన ఈ వైరస్ ఇప్పటికే 100కు పైగా దేశాల్లో వ్యాపించింది. సీఎం కేసీఆర్ విదేశాల నుండి వచ్చే వారిని ముందుగానే కట్టడి చేస్తే కరోనా వ్యాప్తి చెందకుండా చేయవచ్చని భావిస్తున్నారు.
యూరప్ దేశాలలో కరోనా ఎక్కువగా ప్రభావం చూపుతోంది. అక్కడ మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చేయడానికి పలు కీలక నిర్ణయాలను అమలులోకి తెస్తున్నాయి. ఏడు దేశాల నుండి వచ్చే వ్యక్తులకు థర్మల్ స్క్రీనింగ్ తో పాటు వారిని మూడు కేటగిరీలుగా విభజించనున్నారు.
మొదటి కేటగిరీలో ఎయిర్ పోర్టులో ఫ్లూ లక్షణాలతో కనిపించే వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరీక్షలు చేస్తారు. మరో కేటగిరీలో 60 సంవత్సరాలకు పై బడిన వ్యక్తులకు నేరుగా క్వారంటైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్లూ లక్షణాలు ఉన్నా లేకున్నా వారిని ప్రత్యేక గదుల్లో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. చివరి కేటగిరీ వ్యక్తులను కూడా క్వారంటైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గచ్చిబౌలి స్టేడియంలోని గదులతో పాటు అనంతపురంలోని హరిత రిసార్ట్, దూలపల్లిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అకాడమీలను ఏడు దేశాల నుండి వచ్చే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు వివిధ దేశాల నుండి 4000 మంది ప్రయాణికులు హైదరాబాద్ కు వస్తారు. ఈ 4,000 మందిలో ఆ ఏడు దేశాల నుండి వచ్చే ప్రయాణికుల సంఖ్య 35 నుండి 40 మధ్యలో ఉంటుందని తెలుస్తోంది.