కేంద్రం కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసింది. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేశారు. అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన వారితో కలిసి ఏకగ్రీవంగా ఎన్నికైన వారు బాధ్యతలు స్వీకరిస్తారని స్పష్టం చేశారు. 
 
ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ చంద్రబాబు నాయుడే రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించారని, కావాలనే స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని ప్రకటన చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్ ఎన్నికల కమిషనర్ పై విమర్శలు చేస్తున్న సమయంలో టీడీపీ నేత చేసిన ట్వీట్ రాష్టంలో చర్చనీయాంశం అయింది. 
 
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ కీలకనేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా "కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా నేను మీడియా ద్వారా, వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా కోరిన వెంటనే స్పందించి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారికి ధన్యవాదములు.. " అని ట్వీట్ చేశారు. 
 
సోమిరెడ్డి తాను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషనర్ ను ఎన్నికలు వాయిదా వేయాలని కోరానని చెప్పడం చర్చనీయాంశం అయింది. సోమిరెడ్డి నిన్న మీడియాతో మాట్లాడిన మాటలకు సంబంధించిన ఫోటోలను కూడా ట్వీట్ కు జత చేశారు. మరో ట్వీట్ లో " ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా..నామినేషన్లు పూర్తయ్యాయి..ఎన్నికల తేదీ వాయిదా వేస్తే కొంపలేం మునిగిపోవు..కరోనా వైరస్ మరింత విస్తరించి ప్రజలకు ఏమైనా జరిగితే ప్రభుత్వం, అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్ దే బాధ్యత..." అని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: