దేశంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. నిన్న రెండు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరోవైపు ఏడుగురు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసులు పెద్దగా నమోదు కాకపోయినా.. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. 

 

దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు 84కు చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా పాజిటివ్‌ అని తేలిన తర్వాత చికిత్స తీసుకుని కోలుకున్న ఏడుగురిని డిశ్చార్జి చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అందులో యూపీ నుంచి ఐదుగురు, రాజస్థాన్‌, ఢిల్లీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. కరోనా పాజిటివ్‌ అని తేలిన 84 మందితో సన్నిహితంగా మెలిగిన 4వేల మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు కేంద్రం ప్రకటించింది. 

 

కరోనా వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ రూ.4లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ను విపత్తుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోగుల చికిత్సకు ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరించనుంది. 

 

మరోవైపు నాగపూర్‌లో కరోనా లక్షణాలు ఉన్న నలుగురు వ్యక్తులు సిబ్బందికి చెప్పకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడం కలకలం సృష్టించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వారిని గుర్తించి మళ్లీ ఆస్పత్రికి రప్పించారు. నలుగురు వ్యక్తులకు సంబంధించి కరోనా పరీక్ష ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. 

 

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి, తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని యోగా గురు రాందేవ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ యోగా సాధన చేయండని కోరారు. మొత్తానికి కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రధానితో పాటు కేంద్రమంత్రులు, సిబ్బంది ఒకింత ఊపిరిపీల్చుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: