ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు వైసీపీలోకి వెళుతున్నారు. అయితే ఊహించని విధంగా ప్రకాశం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కరణం బలరాం ఫ్యామిలీ కూడా వైసీపీలోకి వెళ్లిపోయింది. టీడీపీకి వీర విధేయులుగా, చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే కరణం వైసీపీ వెళ్ళడంతో టీడీపీ కేడర్ షాక్ అయింది. పైగా కమ్మ సామాజికవర్గంలో బలంగా ఉన్న కరణం వెళ్ళడం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
అయితే ఇప్పటికే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లాంటి కమ్మ నేతలు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే వీరేగాక, మరికొందరు కమ్మ నేతలు కూడా వైసీపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. కాకపోతే ఎవరు పార్టీ మారిన గుంటూరు కమ్మ నేతలు మాత్రం ఫ్యాన్ గాలి కిందకి వెళ్ళేలా కనిపించడం లేదు. గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గంలో బడా నేతలు చాలామందే ఉన్నారు. అయితే వారంతా మొన్న ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, వినుకొండలో జివి ఆంజనేయులు, తెనాలిలో ఆలపాటి రాజాలు ఉన్నారు. ఇక కోడెల ఫ్యామిలీ, గల్లా ఫ్యామిలీ, రాయపాటి ఫ్యామిలీలు కూడా కమ్మ సామాజికవర్గం వారే. అయితే ఈ కమ్మ నేతలు ఎవరు పెద్దగా ఫ్యాన్ వైపు చూస్తున్నట్లు కనిపించడం లేదు.
పైగా వైసీపీ కూడా వీరిని లాక్కునే ప్రయత్నం చేయడం లేదు. వీరంతా టీడీపీకి వీర విధేయులు కాబట్టి, వైసీపీ వీరి వైపు చూడటం లేదు. కాకపోతే గత ప్రభుత్వంలో అక్రమాలు చేశారనే ఆరోపణలు రావడంతో, ఈ కమ్మ నేతలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అయితే వీరిలో రాయపాటి ఫ్యామిలీ ఫ్యాన్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులని బట్టి వారు జంప్ అయిపోయే అవకాశముంది.