ఈ మధ్య కాలంలో పంట బాగా పండినా గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు పెట్టుబడులు, పురుగు మందుల ధరలు పెరుగుతోంటే ధర మాత్రం అమాంతం తగ్గుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర పంటలు పండించిన రైతులతో పోలిస్తే టమాట రైతుల పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో పంటను రైతులు రోడ్ల మీద పారబోయాల్సిన పరిస్థితి నెలకొంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో టమాట రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఫిబ్రవరి నెల నుండి మార్కెట్ కు భారీగా టమాట దిగుమతి అవుతూ ఉండటంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు నెలల క్రితం 20 రూపాయలకు కిలో టమాట పలకగా ప్రస్తుతం పది రూపాయలకు మూడు కిలోలు విక్రయిస్తున్నారు. టమాట ధరలు భారీగా తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ మార్కెట్ లో ప్రజలకు పది రూపాయలకు మూడు కిలోల చొప్పున టమాట విక్రయిస్తున్నారు. ధరలు తగ్గడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 362 హెక్టార్లలో రైతులు టమాట పంటను సాగు చేశారు. రోజూ వేల సంఖ్యలో ఇక్కడినుండి హైదరాబాద్ మార్కెట్ కు టమాట బాక్సులు వెళతాయి. హైదరాబాద్ మార్కెట్ లో ధర తగ్గటంతో రైతులు వికారాబాద్, తాండూరు మార్కెట్ కు టమాట తీసుకెళుతున్నారు.
కొనుగోలుదారులు ఎక్కువగా లేకపోవడంతో 25 కిలోల బాక్స్ ధర 30 రూపాయల నుండి 50 రూపాయలు పలుకుతోంది. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో టమాట మంచి ధర పలుకుతోంది. ఈ సంవత్సరం టమాటకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో రైతులు పంటను మార్కెట్ లోనే వదిలేసి వెళుతున్నారు. కొందరు కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని... పంట స్థానంలో వేరే పంట వేసి ఉంటే మంచి లాభాలు వచ్చి ఉండేవని రైతులు చెబుతున్నారు.