ఈ మధ్య కాలంలో వావీవరసలు చూడకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కోడలిని కూతురులా చూసుకోవాల్సిన మామ ఆమెపై మోజుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన కొడుకు తండ్రిని దారుణంగా హత్య చేశాడు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం శ్రీరాంపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
పూర్తి వివరాలలోకి వెళితే తమ్మారావు, దండమ్మ దంపతులు ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇద్దరు కొడుకులకు ఇప్పటికే వివాహం కాగా పెద్ద కుమారుడు ఆదినారాయణ అదే ఇంటిలో మరో పోర్షన్ లో ఉంటున్నాడు. చిన్నకుమారుడు బాబూరావు భార్య, తల్లిదండ్రులతో కలిసి మరో పోర్షన్ లో ఉంటున్నారు.
నాలుగు రోజుల క్రితం తమ్మారావు కొడుకు ఇంట్లో లేని సమయంలో పెద్ద కోడలిని లైంగికంగా వేధించాడు. తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని కోరాడు. మామ వికృత చేష్టలు, వంకర బుద్ధి చూసి భయాందోళనకు గురైన మహిళ భర్తకు జరిగిన విషయాన్ని చెప్పింది. కొడుకు తండ్రిని ప్రశ్నించటంతో కొంత సమయం పాటు ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
గొడవ పెద్దది కావడంతో పొలానికి వెళ్లిన తమ్మారావు ఇంటికి రాకుండా అక్కడే ఉంటున్నాడు. తండ్రి భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆదినారాయణ తన తండ్రిని చంపేయాలని నిర్ణయించుకుని పొలందగ్గర నిద్రపోతున్న తండ్రి తలపై బలంగా కొట్టాడు. నిన్న ఉదయం పొలానికి వెళ్లిన దండమ్మ విగతజీవిగా పడి ఉన్న భర్త శవాన్ని చూసి రోదించింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన పెద్ద కుమారుడే హత్య చేశాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు స్థానికులు, మృతుడి భార్య నుంచి కేసుకు సంబంధించిన వివరాలలను సేకరిస్తున్నారు.