ప్రపంచ మహమ్మారి కొవిడ్‌-19 క్రీడా రంగాన్ని కూడా కుదిపేస్తోంది. వైరస్‌ దెబ్బకు టోర్నీల వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్‌పై ఇప్పటికే నీలినీడలు కమ్ముకోగా.. అది పూర్తిగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయ్‌. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరగాల్సిన సిరీస్‌ వాయిదా పడగా.. దక్షిణాఫ్రికా రెండు నెలల పాటు అన్ని క్రికెట్ మ్యాచ్‌లను వాయిదా వేసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా వివిధ క్రీడలకు చెందిన కొంతమంది ఆటగాళ్లకు వైరస్‌ సోకినట్లు తేలడం ఆ భయాన్ని మరింత పెంచుతోంది.

 

కరోనా వైరస్‌ కట్టడి చేసేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేశారు. పరిస్థితుల్లో సానుకూల మార్పు కనిపిస్తే టోర్నీపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అయితే కొవిడ్‌-19 ముప్పు కాస్త ఎక్కువగానే కనిపిస్తుండటంతో.. అన్ని ఫ్రాంచైజీలు ఈ సీజన్‌పై ఆశలు వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. జట్లన్నీ ఈ సారి టోర్నీ ఉండకపోవచ్చని మానసికంగా సంసిద్ధమయ్యాయి. సోమవారం జరిగిన ఫ్రాంచైజీలు, బీసీసీఐ కాన్ఫరెన్స్‌ కాల్‌లో.. ఈ విషయంపై చర్చించారు. నష్టాలొచ్చినా ప్రజా సంక్షేమమే ముఖ్యమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

 

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు శిక్షణ శిబిరాలను రద్దు చేయడంలో ఆటగాళ్లందరూ ఇంటిముఖం పట్టారు. మూడుసార్లు ఛాంపియన్లు ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇప్పటికే శిబిరాలను ఆపేశాయి. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 21న ఆరంభం కావాల్సి ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు శిబిరాన్ని రద్దు చేశామని, క్రికెటర్లంతా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించి సురక్షితంగా ఉండాలని ట్వీట్ చేసింది RCB. ముంబయిలోని ప్రధాన కార్యాలయాన్ని మూసివేసింది బీసీసీఐ. మంగళవారం నుంచి ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగులను ఆదేశించింది బోర్డు. 

 

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో టీమిండియా వైస్‌ కెప్టన్‌ రోహిత్‌ ట్విటర్‌లో భావోద్వేగపూరిత వీడియో పోస్టు చేశాడు. మీకు పలు విషయాలు చెప్పదల్చుకున్నానంటూ .. ప్రస్తుత పరిస్థితులపై కలిసికట్టుగా పోరాడుదామంటూ తెలిపారు రోహిత్ శర్మ.

 

భారత హాకీపై కరోనా ప్రభావం పడింది. ఈ వైరస్‌ కారణంగా వచ్చే నెల 10 నుంచి ఆరంభం కావాల్సిన జూనియర్‌, సబ్‌ జూనియర్‌ జాతీయ ఛాంపియన్‌షిప్స్‌ను వాయిదా వేస్తున్నట్లు భారత హాకీ సమాఖ్య ప్రకటించింది. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటే రద్దు చేసే ఛాన్స్ ఉన్నట్టు ప్రకటించారు భారత హాకీ అధ్యక్షుడు ముస్తాక్‌ అహ్మద్‌.

 

మరోవైపు.. దక్షిణాఫ్రికా దేశంలోని అన్ని క్రికెట్‌ ఫార్మెట్లను 60 రోజుల పాటు నిషేధించింది. ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రామాఫోసాతో సమావేశమైన.. క్రికెట్ సౌతాఫ్రికా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు వైరస్‌ భారిన పడకుండా చూసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం క్రికెట్‌లోని వివిధ ఫార్మెట్లలో పాల్గొంటున్న సుమారు వంద మందిని ఎటువంటి ఆటలు ఆడకుండా నిలువరించాలనుకుంటున్నట్టు ప్రకటించారు ప్రొటీస్ అధికారులు. ఈ నిషేధం కారణంగా ప్రస్తుతం అక్కడ జరుగుతున్న మొమెంటమ్ వన్డే కప్‌ సెమీస్‌, ఫైనల్స్‌ కూడా రద్దయ్యాయి. 

 

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరగాల్సిన వన్డే, టెస్టు మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు రెండు దేశాల క్రికెట్‌ బోర్డులు ప్రకటించాయి. 24న ఆరంభం కావాల్సిన పాకిస్థాన్‌ కప్‌ వన్డే టోర్నీని కూడా ఆ దేశ క్రికెట్‌ బోర్డు వాయిదా వేసింది పాక్‌. మరోవైపు వచ్చే నెలలో ఐర్లాండ్‌లో జింబాబ్వే పర్యటన సైతం వాయిదా పడింది. 

 

కరోనా ను ఎదుర్కోవడానికి తన వంతు సహాయం అందించాడు ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డో. తన హోటళ్లను కరోనా పై పోరాడేందుకు హాస్పిటల్స్‌గా మార్చేశాడు. ఎవరైనా సరే వీటిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ప్రకటించాడు. అలాగే తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు రోనాల్డో అందులో... ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న అని అంశాలను తన అభిమానులు ప్రజలు పాటించాలని కోరారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: