సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టళ్లను మూసివేసేలా చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు జీ.హెచ్.ఎం.సీ ఉప కమిషనర్ గీతా రాధిక అమీర్ పేట్, ఎస్సార్ నగర్ లో ఉన్న 850 హాస్టళ్లు, ఐటీ కోచింగ్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
అమీర్ పేట్, మైత్రీవనం, ఎస్సార్ నగర్ లలోని కోచింగ్ సెంటర్లలో నిత్యం వేల సంఖ్యలో విద్యార్థులు కోచింగ్ తీసుకుంటారనే విషయం తెలిసిందే. కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే హాస్టళ్లు, శిక్షణా సంస్థల నిర్వాహకులకు జీ.హెచ్.ఎం.సీ. కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు నిర్వాహకులకు ఈరోజు నుండి స్వస్థలాలకు పంపించాలని సూచించారు. 
 
ఎవరైనా నిబంధనలను అతిక్రమించి వసతి గృహాలు, కోచింగ్ సెంటర్లను నిర్వహించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రైవేట్ హాస్టళ్లతో పాటు ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులను స్వస్థలాలకు పంపించేందుకు డెడ్ లైన్ విధించింది. హైదరాబాద్ ప్రైవేట్ హాస్టళ్లలో విద్యార్థులతో పాటు ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారు. హాస్టళ్లను ఖాళీ చెస్తే తాము ఎక్కడ ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
హైదరాబాద్ లోని ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీపై కూడా కరోనా ప్రభావం పడింది. ఓయూ పరిధిలోని హాస్టళ్లను, మెస్ లను ముసివేస్తున్నట్లు అధికారులు ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తాము చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారులు హాస్టళ్లకు విద్యుత్ సరఫరా, మంచినీరు నిలిపివేసినట్లు సమాచారం. హాస్టళ్ల నిర్వాహకులు స్వస్థలాలకు వెళ్లిపోవాలని సూచించటంతో కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.             

మరింత సమాచారం తెలుసుకోండి: