కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లాలో ఓటరు కార్డులో మహిళ ఫోటో బదులు హీరో వెంకటేష్ ఫోటో వచ్చింది. మరో ఘటనలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న వసతి దీవెనకు సంబంధించిన రెండు కార్డుల్లో హీరో మహేష్ బాబు ఫోటో వచ్చింది. ఇలాంటి చిత్రవిచిత్రాలు చోటు చేసుకోవడం, ప్రజలు విమర్శలు చేయడం జరిగింది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి హాల్ టికెట్ లో అతని ఫోటో బదులు పబ్ జీ గేమ్ ఫోటో వచ్చింది.
విద్యార్థుల కెరీర్ కు సంబంధించిన హాల్ టికెట్ల విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫోటోతో పాటు విద్యార్థి పేరు చివరన, విద్యార్థి తండ్రి పేరు చివరన పబ్ జీ ని జోడించి ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం విద్యార్థి హాల్ టికెట్ వైరల్ అవుతోంది. విద్యాశాఖ ఈ హాల్ టికెట్ గురించి స్పందించాల్సి ఉంది.
హైదరాబాద్ నగరంలోని శాలిబండకు చెందిన హిదాయత్ ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం విద్యాశాఖ హాల్ టికెట్లను పాఠశాలలకు పంపటంతో పాటు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. కొన్ని రోజుల్లో పరీక్షలు ఉండటంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థికి హాల్ టికెట్ ఇచ్చింది. అందులో తన ఫోటో బదులు పబ్ జీ ఫోటో ఉండటంతో షాక్ అవ్వడం విద్యార్థి వంతయింది.
విద్యార్థి హాల్ టికెట్ నంబర్ 2022114399. హాల్ టికెట్ లో పరీక్షలకు సంబంధించిన వివరాలు, పరీక్ష కేంద్రం వివరాలు కరెక్ట్ గానే ఉన్నాయి. విద్యార్థి కుటుంబ సభ్యులు ఇప్పటికే సంబంధిత అధికారులను ఈ విషయం గురించి సంప్రదించారని తెలుస్తోంది. తెలంగాణ విద్యాశాఖ వెబ్ సైట్ లో కూడా విద్యార్థి ఫోటోకు బదులు పబ్ జీ ఫోటో కనిపిస్తూ ఉండటం గమనార్హం.