ప్రజాబలం లేని నేతలను పైగా బాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఎందుకు తీసుకుంటున్నాడో అర్ధం కావటం లేదు. తెలుగుదేశంపార్టీకి రాజీనామాలు చేసి వైసిపి కండువా కప్పుకుంటున్న ఇటువంటి వాళ్ళ వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేకపోగా భవిష్యత్తులో సమస్యలు రావటం మాత్రం ఖాయమనే అర్ధమవుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ యామినీ బాల, ఎంఎల్సీ శమంతకమణి జగన్  సమక్షంలో వైసిపిలో చేరారు.

 

వీళ్ళద్దరి చేరిక తర్వాత పార్టీలో చర్చ మొదలైంది. గడచిన పదిరోజుల్లో టిడిపికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు సుమారు పదిమంది వైసిపిలో చేరుంటారు. ఇలా చేరిన వారిలో అందరూ గట్టి వాళ్ళేనా ? అంటే కాదనే సమాధానం వస్తుంది. పైగా చేరిన వాళ్ళల్లో చాలామందిపై అవినీతిపరులనే ముద్ర బలంగా ఉంది. మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, గాదె వెంకటరెడ్డి, పాలేటి రామారావు,  మాజీ ఎంఎల్ఏలు కదిరి బాబురావు, రెహ్మాన్, పాలకొండరాయుడు లాంటి చాలామంది వైసిపిలో చేరారు.  మాజీ ఎంఎల్సీ సతీష్ రెడ్డి, ఎంఎల్సీ కెఇ ప్రభాకర్, మాజీ ఎంఎల్ఏ పంచకర్ల రమేష్ తొందరలో పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

వాస్తవం ఆలోచిస్తే ఇపుడు చేరిన వాళ్ళల్లో కానీ ఇంతకముందే చేరిన మాజీ ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళ వల్ల కానీ పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు చేరిన వాళ్ళందరిలోకి మహా అయితే రామసుబ్బారెడ్డి ఒక్కడు గట్టివాడేమో. చేరుతారనే ప్రచారం ఉన్న వాళ్ళల్లో సతీష్ రెడ్డి కూడా పర్వాలేదు. ఎందుకంటే వీళ్ళంతా టిడిపిలో ఉన్నపుడే  మొన్నటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులను గెలిపించలేకపోయారు. లేదా వీళ్ళే పోటి చేసి ఓడిపోయారు. పార్టీ గాలి వీస్తే మాత్రమే గెలిచే ఇలాంటి వాళ్ళని జగన్ ఇపుడు ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నాడో అర్ధం కావటం లేదు. వీళ్ళంతా టిడిపిలో ఉంటేనే వైసిపికి మేలు కలుగుతుందేమో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: