నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పేరుతో సోషల్ మీడియాలో ఒక లేఖ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ లేఖ వ్యవహారంపై సీరియస్ అయింది. ఈసీ పేరుతో వైరల్ అయిన లేఖను టీడీపీ విపరీతంగా ప్రచారం చేసింది. ఎన్నికల కమిషనర్ ఇప్పటికే ఒక ప్రముఖ ఛానల్ కు అది తాను రాసిన లేఖ కాదని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
వైసీపీ ఎన్నికల కమిషన్ నిర్ణయంపై విమర్శలు చేసింది. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా కోర్టు ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సమర్థించింది. ఏపీలో ఎన్నికల కోడ్ ను ఎత్తివేయాలని ఈసీకి సూచించింది. టీడీపీ కుట్రపూరితంగా ఈ లేఖను తెరపైకి తెచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తాజా లేఖపై విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకోవాలని భావిస్తోంది. 
 
నిమ్మగడ్డ ఒక వార్తా ఛానల్ కు తాను ఈ లేఖను రాయలేదని చెప్పినా అధికారికంగా స్పందించలేదు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైరల్ అవుతున్న లేఖ వివాదంపై స్పందించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఎన్నికల కమిషనర్ కు కొమ్ము కాస్తూ చంద్రబాబుకు తొత్తులా రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా నిమ్మగడ్డ పేరుతో విడుదలైన లేఖ ఉందన్నారు. 
 
ఎన్నికల కమిషనర్ వైరల్ అవుతున్న లేఖ గురించి స్పందించకపోవటంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని అన్నారు. చంద్రబాబు కార్యాలయంలో ఆ లేఖను ప్రిపేర్ చేశారని తమకు అనుమానంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీ నేతలా వ్యవహరిస్తున్నారని కేంద్రం రమేష్ కుమార్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వంపై సాక్ష్యాధారాలు లేకుండా నిందలు మోపడం సరికాదని వ్యాఖ్యలు చేశారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: