దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంట్ పై కరోనా ప్రభావం పడింది. బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పాల్గొన్న విందు పార్టీకి హాజరు కావడం, పార్టీ జరిగిన మరుసటి రోజే దుష్యంత్ పార్లమెంట్ కు హాజరు కావడం.. పార్లమెంట్ లో ఎంపీలు మనోజ్ తివారీ, నిశికాంత్ లను కలవడం జరిగింది.
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం.. ఆ విందుకు హాజరైన దుష్యంత్ పార్లమెంట్ కు రావడంతో పార్లమెంట్ సభ్యులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే దుష్యంత్ సెల్ఫ్ హోం క్వారంటైన్ కు సిద్ధమయ్యాడు. దుష్యంత్ కు సమీపంలో కూర్చున్న టీఎంసీ ఎంపీ డెరెట్ ఓ బ్రెయిన్ సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నట్లు ప్రకటన చేశారు.
మరో ఇద్దరు ఎంపీలు కూడా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నట్లు సమాచారం అందుతోంది. దుష్యంత్ దేశ అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. దుష్యంత్ ఆ పార్టీకి హాజరు కావడంతో పార్లమెంట్ సభ్యులు తెగ టెన్షన్ పడుతున్నారు. కొందరు ఎంపీలు అనధికారికంగా ఇంటికే పరిమితమయ్యారని... వారు కరోనా సోకుతుందని విపరీతంగా ఆందోళన చెందుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఎంపీలతో పాటు పార్లమెంట్ ఆవరణలోని పోలీస్ అధికారులు, ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు కూడా తమకు కరోనా సోకుతుందేమో అనే అనుమానంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేయాలని నేతల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల లండన్ నుంచి వచ్చిన కనిక ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన పార్టీలో పాల్గొన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది.