చైనా దేశానికి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం బాగా అలవాటు అనుకుంటా. మహమ్మారి కరోనా వైరస్ బీభత్సం సృష్టించే వరకు చైనా దేశం మేలుకోకపోవడం వల్ల, కరోనా ప్రపంచాన్నే చుట్టేసింది. ఇక చైనాలో అయితే కరోనా ఏ స్థాయిలో విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైరస్ బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వేల మంది వైరస్ బారిన పడ్డారు.
ఇదిలా ఉంటే ఈ వైరస్ మొదట్లో ఉన్నప్పుడే అప్రమత్తం చేసిన చైనా వైద్యుడు కూడా కరోనాతో మృతి చెందాడు. కరోనాను తొలిగా గుర్తించి అప్రమత్తం చేసిన వైద్యుడు లీ వెన్‌లియాంగ్ (34) అదే వైరస్‌తో మృతి చెందాక చైనా దేశం అతని కుటుంబానికి సారీ చెప్పి చేతులు దులుపుకుంది. అసలు ఏమైందంటే.. వైద్యుడుగా ఉన్న లీ దగ్గరకు వచ్చిన ఏడుగురికి సార్స్ వైరస్‌ను పోలిన వైరస్‌ను తాను గుర్తించానని అక్కడి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు.
అలాగే ఈ విషయాన్ని డిసెంబర్ 30న ‘వి చాట్’ గ్రూప్ లో ఆయన షేర్ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వూహాన్ పోలీసులు...అసలు విషయాన్ని వదిలేసి లీ కు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి మెసేజ్‌లు చేస్తే జైలులో పెడతామని గట్టిగా హెచ్చరించారు. ఇక ఆ దెబ్బతో లీ సైలెంట్ అయిపోయాడు.
అయితే అతను గుర్తించిందే కరోనా వైరస్‌ని. ఆ లక్షణాలున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు చేసిన నేపథ్యంలో వెన్ లియాంగ్‌కు ఆ వైరస్ సోకింది. ఇక తనకు కరోనా సోకిందని తెలుసుకునేలోపే పరిస్తితి చేయి దాటేసింది. ఆ వైరస్ కారణంగానే ఆయన జనవరి 10న ప్రాణాలు వదిలారు. ఇక అతను ప్రాణాలు విడిచాడని తెలుసుకున్న చైనా దేశం, ఇప్పుడు అతని కుటుంబానికి సారీ చెప్పి, చేతులు దులుపుకుంది. అసలు ఆ వైద్యుడు చెప్పినప్పుడే అప్రమత్తంగా ఉండుంటే ఇంత బీభత్సం జరిగేది కాదు.