ఏపి ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై నిప్పులు చెరిగాడు. స్ధానిక సంస్ధల ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయటం, సుప్రింకోర్టు తీర్పు, అదేరోజు కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖలోని అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. పనిలో పనిగా చంద్రబాబునాయుడు ఆలోచన విధానంపైన కూడా కొన్ని చెణుకులు విసిరారు. అలాగే కరోనా వైరస్ నియంత్రణకు జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూలు, ఇచ్చిన ఆదేశాలు, తీసుకుంటున్న చర్యలను కూడా బుగ్గన వివరించాడు.
అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా వివాదం ఆరు రోజుల క్రితంది. అలాగే సుప్రింకోర్టు తీర్పు విషయం కూడా పాతపడిపోయింది. అదే సమయంలో నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ వెళ్ళటం కూడా పాతపడిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే లేఖ వివాదాన్ని తేల్చమంటూ వైసిపి ఎంఎల్ఏలే డిజిపి గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేయటం, పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టటం కూడా మొదలైపోయింది.
అంటే క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బుగ్గన ఎంత లేటుగా స్పందించారనే విషయం అర్ధమైపోతోంది. ఎన్నికలు వాయిదా పడిన రోజే జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి, మంత్రులు, ఎంఎల్ఏలు కూడా స్పందించేసి నిమ్మగడ్డను అమ్మనా బూతులు తిట్టేశారు. మరి అందరూ స్పందించేసిన పాత చింతకాయ పచ్చడి లాంటి వివాందంపై స్పందించటానికి బుగ్గనకు ఇన్ని రోజులు ఎందుకు పట్టిందో ఆయనే చెప్పాలి.
నిజానికి బుగ్గన ప్రెస్ మీట్లో చాలా లాజికల్ గా మాట్లాడుతారు. కానీ వివాదాలపై ఎప్పటికప్పుడు స్పందిచటంలో మాత్రం జీవితకాలం లేటనే చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ పై ఆరోపణలు చేయటంలో చంద్రబాబు, టిడిపి నేతలు ఎప్పటికప్పుడు రెడీగా ఉంటారు. దానికితోడు వాళ్ళకున్న మీడియా వల్ల వాళ్ళ వాదనే జనాల్లోకి ఎక్కువగా వెళుతుంది. ఈ విషయాలు వైసిపికి బాగా తెలిసినా చంద్రబాబు లేకపోతే ప్రతిపక్షాలపై మీడియా ద్వారా ఎదురుదాడి చేయటంలో చాలా స్లో అనే చెప్పాలి. బుగ్గన వైఖరి చూస్తుంటే ఆ విషయం నిజమనే తెలిసిపోతుంది.