నీవే ప్రేమన్నాడు.. ప్రాణమన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.. మూడేళ్లు కలిసి తిరిగి, అచ్చటా.. ముచ్చటా.. తీర్చుకున్నారు.. బోరుకొట్టిందేమోగానీ.. సదరు యువకుడు తన ప్రియురాలిని వదిలి, మరో మరో యువతికి మూడు ముళ్ళు వేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ప్రియురాలు పోలీసులను ఆశ్రయించడంతో, ఆ మూడుముళ్లకు బ్రేకులు పడ్డాయి. అవును.. పెళ్లి పీటల మీదే పెళ్లి ఆగిపోయింది.
సినీ ఫక్కీలో సాగిన ఈ ఉదంతం.. పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.. సెంటినరీ కాలనీకి చెందిన నాగెళ్లి సాంబయ్య, స్వరూపరాణి దంపతుల మొదటి కుమారుడు అయిన వరుణ్ కుమార్, హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో మూడేళ్లుగా ప్రేమ కహాని సాగించాడు. తీరా అచ్చటా ముచ్చటా.. తీరాక, సూర్యాపేట జిల్లాకు చెందిన మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు.
ఈ శనివారం అనగా నిన్న ఉదయం 9.58 గంటలకు వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సర్వ సిద్ధమైనాయి.. సదరు మండపంలో అంగ రంగ వైభవంగా వేడుక జరుగుతున్న వేళ, హఠాత్తుగా పోలీసుల ఎంట్రీతో అక్కడ వున్న బంధుజనం అంతా... అవాక్కయ్యారు. విషయం ఏమంటే... బాధిత యువతి హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో ప్రేమపేరుతో మోసం చేశాడని, మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని ఫిర్యాదు చేయడంతో ఇక పోలీసుల ఎంట్రీ తప్పలేదు..
అంతా సవ్యంగా జరిగిపోతుంది అనుకున్న ఆ యువకుడికి దీనితో ఓ కమర్షియల్ బ్రేక్ పడింది. అక్కడి పోలీసులు రామగిరి మండల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, శనివారం కొత్తపెళ్ళికొడుకు అయిన వరుణ్‌ను అరెస్టు చేసి, కటకటాల వెనక్కి నెట్టారు. ఈ మొత్తం ఉదంతాన్ని తిలకించిన బంధు జనాలు సదరు పెండ్లి కుమారుడి కుటుంబాన్ని తిట్టుకుంటూ... వారి ఇళ్లకు వెను దిరిగారు.