గురువారం రోజు ప్రధాని మోడీ చెప్పినట్టుగా... భారతదేశంలోని ప్రతి ఒక్కరు తమ ఇళ్ల నుండి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూను పర్ఫెక్ట్ గా పాటిస్తున్నారు. ఈ జనతా కర్ఫ్యూ కారణంగా దేశంలోని ప్రతి ఒక్కరికీ కరోనా వైరస్ వ్యాప్తి గురించి అవగాహన వస్తుంది. చదువురాని వ్యక్తులకు కూడా ప్రాణాంతక కరోనా వైరస్ భారతదేశంలోకి సంక్రమించిందని, తమని తాము కాపాడుకోవడానికి మాస్కులు ధరించాలని, చేతులు తరచూ కడుక్కోవాలి అని, ఎక్కువ మంది జనాల్లో అసలే తిరగకూడదనే అవగాహన వచ్చిందంటే దానికి ముఖ్య కారణం ఈ రోజు కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ బంద్ అని చెప్పుకోవచ్చు.
మోడీ గురువారం రోజు కరోనా వైరస్ గురించి చెప్పక ముందు... గ్రామాలలోని ప్రజలకు ఈ వైరస్ గురించి అణువంతైనా అవగాహన లేదు. కానీ మోడీ ఎప్పుడైతే జనతా కర్ఫ్యూ ని పాటించమని చెప్పారో ఆ మరుసటి రోజు నుండే ప్రజలకు కరోనా వ్యాప్తి గురించి తెలిసింది. ఒక్కరోజు జనతా కర్ఫ్యూ చేసినంత మాత్రాన కరోనా వైరస్ చచ్చిపోతుందా అని చాలామంది సామాజిక మాధ్యమాలలో కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ ఒక్కరోజు జనతా కర్ఫ్యూ వలన ప్రజల్లో వచ్చే అవగాహన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఎంతో సహాయపడుతుందని వారికి తెలియక పోవడం దురదృష్టకరం. ఏది ఏమైనా మన దేశంలో జనతా కర్ఫ్యూ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది.
తాజాగా ముంబాయికి చెందిన 63 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. మరోవైపు రజినీకాంత్ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి... 'మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండవ దశలో ఉంది. ఒకవేళ మూడవ దశలో కి వెళితే చాలా ప్రమాదకరం. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కు పిలుపునిచ్చారు. ఇటలీలో కూడా కరోనా వైరస్ రెండవ దశ లోనే ఉన్నప్పుడు... అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూ కి పిలుపునిచ్చింది. కానీ ఆ దేశస్తులు కర్ఫ్యూ ని పాటించకుండా తప్పు చేసారు. అందుకే వేలాది మంది ప్రాణాలను కోల్పోయారు. ఇటలీ పరిస్థితి మన భారతదేశానికి రాకూడదు. అలా రాకూడదంటే ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు జనతా కర్ఫ్యూ ని పాటించాలి' అని చెప్పుకొచ్చారు.