దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు 31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు చేరగా ఏపీలో ఆరుకు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ విదేశాల నుంచి వచ్చేవారితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. వైద్యులు ఇప్పటివరకూ దగ్గు, జ్వరం, జలుబు ఉన్నవారిని మాత్రమే కరోనా బాధితులుగా గుర్తిస్తున్నారు. 
 
అయితే కరోనా బాధితుల్లో మరికొన్ని లక్షణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరం లేకపోయినా కొంతమంది కరోనా సోకితే వాసన లేదా రుచిని కోల్పోతున్నారని ప్రకటన చేశారు. కరోనా ఎక్కువగా కళ్లు, ముక్కు, గొంతు ద్వారా సోకుతుందని.... రుచి, వాసన కోల్పోవడం కరోనా లక్షణాలు అని వైద్యులు చెబుతున్నారు. కరోనా భారీన పడినవారిలో రోజురోజుకు వాసన, రుచి సామర్థ్యం బలహీనపడవచ్చని అభిప్రాయపడుతున్నారు. 
 
జ్వరం, దగ్గు లేకపోయినా దాదాపు 66 శాతం మంది రోగులలో రంగు, రుచి కోల్పోతున్న లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా వ్యాధికి ఈ లక్షణాలు మాత్రమే కాక విరేచనాలు కూడా మరో లక్షణమని అంటున్నారు. కరోనా సోకిన 30 మందిలో ఈ లక్షణం కనిపిస్తోందని చెబుతున్నారు. సాధారణంగా కరోనా సోకిన చాలా మందికి జ్వరం, పొడి దగ్గు, కండరాల నొప్పులు, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు. 
 
కొంతమందిలో మాత్రం ఈ లక్షణాలు కనిపించకపోయినా విరేచనాలు అవుతూ రుచి లేదా వాసన కోల్పోతే కరోనా కావచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వీలైనంతవరకు ఇళ్లకే పరిమితం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని... బయటకు వచ్చినా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: