కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం నిబంధనలను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ లాక్ డౌన్ ను ప్రైవేట్ ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటూ ఉండటం గమనార్హం. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నుంచి ప్రాంతాన్ని బట్టి ప్రైవేట్ ట్రావెల్స్ రేటును ఫిక్స్ చేస్తున్నాయి. 
 
ప్రయాణికులు వాహనాల కోసం ఎగబడుతూ ఉండటంతో వారిని అక్కడినుంచి పంపించలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారు. ఎల్బీ నగర్ లో గుంపులుగుంపులుగా జనం దర్శనం ఇస్తున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులు ఎల్బీ నగర్ నుంచి విజయవాడకు 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తమకు ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందువల్ల సొంతూళ్లకు వెళ్లాలని ప్రయాణికులు చెబుతున్నారు. 
 
మార్చి 31 వరకే లాక్ డౌన్ కొనసాగుతుందా...? మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందా..? తమకు తెలియడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. మరికొందరు వైద్య చికిత్స కోసం హైదరాబాద్ కు వచ్చామని తాము సొంతూళ్లకు వెళ్లటానికి వేరే మార్గం లేక ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నామని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నుంచి కోదాడకు 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. 
 
కరోనా వైరస్ గురించి అవగాహన ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో తాము సొంతూళ్లకు ప్రయాణమవుతున్నామని ప్రయాణికులు మీడియాకు వెల్లడిస్తున్నారు. నగర వీధుల్లో ప్రైవేట్ వాహనాలతో పాటు ఆటోలు కూడా నడుపుతున్నారని తెలుస్తోంది. బయటకు వస్తున్న వాహనాలు అత్యవసర అవసరాల కోసం వస్తున్నట్లు చెబుతూ ఉండటంతో అధికారులు, పోలీసులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని సమాచారం. మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు చేరింది. కరీంనగర్ లో తొలి లోకల్ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: