తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చినవారు ఎట్టి పరిస్థితుల్లోను బయటకు రాకూడదని సూచించారు. కుటుంబ సభ్యులు కూడా వాళ్లు బయటకు వెళ్లకుండా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33కు చేరిందని 97 మంది అనుమానితులు ఉన్నారని పేర్కొన్నారు. అనుమానితులకు సంబంధించిన నివేదిక రావాల్సి ఉందని అన్నారు. 
 
ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో రేపటినుంచి సాధరణ ఓపీ సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్వారంటైన్ లో ఉన్నవాళ్లను 14 రోజుల తర్వాత పరీక్షలు జరిపి ఇంటికి పంపిస్తామని అన్నారు. హోం క్వారంటైన్ లో ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోను బయట తిరగవద్దని సూచించారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారిని ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేసి పట్టుకుంటామని అన్నారు. 
 
ప్రభుత్వం 31 వరకు ఇళ్లల్లోనే ఉండాలని లాక్ డౌన్ ప్రకటిస్తే కొందరు ప్రజలు ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా బయటకు వస్తున్నారని చెప్పారు. కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు చేశామని.... పరిస్థితి విషమిస్తే ప్రైవేట్ ఆస్పత్రుల సేవలను వినియోగించుకుంటామని అన్నారు. 
 
రాబోయే పది రోజులు చాలా కీలకమని మంత్రి ప్రజలకు సూచించారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా ఉండాలంటే ముందుజాగ్రత్తచర్యలు పాటించాలని చెప్పారు. ప్రపంచానికి ఇప్పటికే కరోనా సోకిన తర్వాత కట్టడి చేయడం కష్టం అనే విషయం అర్థమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం స్టేజ్ 2 లో ఉన్నామని... స్టేజ్ 3 పరిస్థితి రానీయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు 31 వరకు ఇళ్లకే పరిమితం కావలని సూచించారు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: