దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ కరోనా భారీన పడి 8 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకూ 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటే కరోనాను పూర్తి స్థాయిలో నియంత్రించగలమని అన్నారు. పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
 
ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన చేశారు. 108 సిబ్బందికి అవసరమైన వస్తువులను, పరికరాలను అందించనున్నట్లు తెలిపారు. సిబ్బందిలో మనోధైర్యం నింపడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే ఉందని అన్నారు. 
 
ప్రజలు అనవసరంగా భయాందోళన చెందాల్సిన అవసరం అని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పారు. సామాజిక దూరం పాటించి కరోనా భారీన పడకుండా కాపాడుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అమ్మకూడదని సూచనలు చేశారు. 
 
ప్రభుత్వం కరోనా నియంత్రణకు పలు చర్యలు చేపడుతోందని ప్రజలందరూ అందుకోసం సహకరించాలని చెప్పారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనా భారీన పడిన ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కరోనా రెండో దశలో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం మూడో దశలోకి వెళ్లకుండా ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు.                       

మరింత సమాచారం తెలుసుకోండి: