చిత్తూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ అని తేలటంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. యువకుని కుటుంబ సభ్యులను, స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారి నమూనాలను సేకరించి టెస్టుల కోసం ల్యాబ్ కు పంపారు.
పోలీసులు శ్రీకాళహస్తి పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి శ్రీకాళహస్తికి రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. తొలి పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా ప్రజలు అప్రమత్తమయ్యారు. జిల్లాలో పోలీసులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు స్వచ్చందంగా ఇళ్లకే పరిమితమయ్యారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కరోనా పాజిటివ్ గా నమోదైన యువకుడు లండన్ నుంచి 19న చెన్నైకు చేరుకుని కారులో శ్రీకాళహస్తికి వచ్చాడు. వచ్చిన రోజు నుండి అధికారుల సూచనల మేరకు ఇంటికే పరిమితమయ్యాడు. 20వ తేదీన యువకునిలో కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ నెల 23న యువకుని నమూనాలను తీసుకొని పరీక్షించగా నిన్న కరోనా పాజిటివ్ అని తేలింది.
తొలి పాజిటివ్ కేసు నమోదు కావడంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అధికారులను అప్రమత్తం చేశారు. యువకుడి ఇంటితో పాటు, మూడు కిలోమీటర్ల చుట్టుకొలత ప్రాంతంలో హెల్త్ సర్వే చేయాలని సూచించారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఐసోలేషన్ వార్డు పనులు చురుగ్గా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నివేదిక రూపంలో పట్టణంలోకి యువకుడు వచ్చిన రోజు నుంచి అతని కదలికలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను పంపుతామని చెప్పారు.