చిన్న నిర్లక్ష్యం కూడా భారీ నష్టానికి కారణమవుతుంది అనటానికి ఈ ఆస్పత్రే పెద్ద ఉదాహరణ. ఇప్పుడా ఆస్పత్రి కరోనాకు కేంద్రంగా మారే పరిస్థితిలో ఉంది. రాజస్థాన్ లోని భిల్వారా ఆస్పత్రిలో ఏం జరిగింది? ఒక్కసారిగా వైరస్ కేసులు ఎందుకు పెరిగాయి?
వైరస్ ఈ పేరు వింటే చాలు..
కంటికి కనపడదు. మనిషి జాగ్రత్తను అనుక్షణం పరిహసిస్తుంది. ప్రశ్నిస్తుంది. మనకేం కాదులే.. మనకెలా వస్తుందిలే అనుకునేవారికి... ఈ ఆస్పత్రి, ఈ నగరం పెద్ద ఉదాహరణ.
భిల్వారా, రాజస్తాన్ లోని ముఖ్యమైన పట్టణం.
దాదాపు నాలుగు లక్షల జనాభాఉన్న ఈ పట్టణంలో బట్టల పరిశ్రమలు ఎక్కువ. ఇప్పుడీ ప్రాంతం కరోనా ప్రమాదం అంచున ఉంది.
దేశమంతా పలు రాష్ట్రాలు, అనేక జిల్లాలు మార్చ్ 23 నుండి లాక్ డౌన్ అయి ఉంటే, ఈ పట్టణం అంతకుముందే ఎక్కడికక్కడ దిగ్బంధమయింది. ఈ నెల 20 నుండే భిల్వారా నుండి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు. బయటి నుండి ఎవరూ రాకుండా, ఇక్కడినుండి ఎవరూ వెళ్లకుండా, అసలు రోడ్లపైనే ఎవరూ తిరక్కుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనికి కారణం ఒక్కటే. ఈ పట్టణంలోని ఓ ఆస్పత్రి కరోనా కేసులకు కేంద్రంగా మారింది.
అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే పరీక్షించుకోటానికి ఆస్పత్రికి వెళ్తాం. కానీ, ఆ ఆస్పత్రే ఇప్పుడు కరోనాను వ్యాపించేలా మారితే... అంతకంటే డేంజర్ మరొకటి లేదు. నిజానికి ఇటలీలో ఇదే జరిగింది. ఓ కరోనా పేషంట్ నుంచి దాదాపు ఎనిమిది మంది ఆస్పత్రి సిబ్బందికి కరోనా వచ్చింది. ఆ తర్వాత ఆ చైన్ కి అంతం లేకుండా పోయింది. ఇప్పుడు భిల్వారా పట్టణంలో కూడా ఇదే జరగనుందనే ఆందోళన పెరుగుతోంది.
మార్చి 8, 2020న
బ్రిజేష్ బన్ గర్ మెమోరియల్ ఆస్పత్రిలో
ఓ 68ఏళ్ల వృద్ధుడు న్యుమోనియా లక్షణాలతో చేరాడు. అతనికి శ్వాస తీసుకోవటంలో కూడా సమస్య ఉంది. రెండు రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా పరిస్థితి మెరుగవ్వలేదు. దీంతో బెటర్ ట్రీట్ మెంట్ కోసం జైపూర్ తరలించారు. అక్కడా రెండు ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ చేశారు. ఆ రోగి పరిస్థితి క్షీణించి మరణించాడు. ఆ సమయంలో ఐసీయూలో మరో ఆరుగురు పేషంట్లు కూడా ఉన్నారు.
మార్చి 9న మరణించిన రోగికి వైద్యం చేసిన డాక్టర్ మిట్టల్ తో పాటు మరికొందరు ఉదయ్ పూర్ లో ఓ రిసార్ట్ లో హోళీ జరుపుకోవటానికి వెళ్లారు. ఆ తర్వాత డాక్టర్ మిట్టల్ తో పాటు అతని సహోద్యోగులు కొందరు.... స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ మిట్టల్ తో పాటు, 12మంది ఆస్పత్రి సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వార్త బయటకు పొక్కగానే భిల్వారా మొత్తం షాక్ కి గురయింది.