ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా భారీన పడిన వ్యక్తులు కోలుకున్న తర్వాత కూడా వైరస్ సంక్రమించే అవకాశం ఉందని తేలింది. అమెరికాలోని యేల్ యూనివర్సిటీ, చైనాలోని పీఎల్ఏ జనరల్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో కరోనా బాధితులు వ్యాధి నుండి కోలుకున్నా వారిలో 8 రోజుల పాటు వైరస్ ఉంటుందని తేలింది.
కరోనా లక్షణాలు తగ్గిన తరువాత కూడా దాదాపు సగం మంది వైరస్ వ్యాప్తి చేస్తున్నట్లు పరిశోధనల్లో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీవ్ర స్థాయి వైరస్ నుంచి కోలుకున్న వారు ఇంకా ఎక్కువగా వైరస్ ను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని... కోలుకున్న రోగులకు మరో రెండు వారాల పాటు క్వారంటైన్ ను కొనసాగించాలని వారు సూచిస్తున్నారు. లేదంటే మాత్రం వైరస్ విసృతంగా వ్యాప్తి చెంది కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
పరిశోధనలు జరిపిన బృందంలో భారత సంతతికి చెందిన లోకేష్ శర్మ కూడా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ లక్షణాలు తగ్గినా రోగుల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ప్రజలు కొంత జాగ్రత్త వహించాలని సూచించారు. వ్యాధి లక్షణాల నుంచి కోలుకున్నప్పటికీ మరో రెండు వారాల పాటు చికిత్స కొనసాగిస్తే మంచిదని చెప్పారు.