దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడుతూ లాక్ డౌన్ ను ప్రజలంతా తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కరోనాపై పోరులో మనం తప్పనిసరిగా గెలిచి తీరాలని అన్నారు. ప్రజలెవరూ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రభుత్వానికి సహకరించాలని పేర్కొన్నారు. ప్రజల సంయమనమే శ్రీరామరక్ష అని చెప్పారు.
ప్రజల రక్షణ కోసమే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించామని అన్నారు. ప్రజలు నిబంధనలు బేఖాతరు చేస్తే ఇతరులకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. మానవత్వానికే కరోనా సవాల్ విసురుతోందని... కరోనాను కట్టడి చేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరం అని అన్నారు. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని... వైరస్ తీవ్రత ప్రజలకు అర్థం కావడం లేదని అన్నారు. వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ మాత్రమే పరిష్కార మార్గం అని చెప్పారు.
వైరస్ ను జయించిన వారే మనకు స్పూర్తి ప్రధాతలు అని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000కు చేరువైంది. దేశంలో ఇప్పటివరకూ 979 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కరోనా భారీన పడి దేశంలో 25 మంది మృతి చెందారు.