దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేయడానికి మాత్రమే రోడ్లపైకి వస్తున్నారు. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి కదలటం లేదు. 
 
కానీ కొందరు మాత్రం ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదు. అవసరం లేకపోయినా రోడ్లపైకి వస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు అత్యవసర పనుల కోసం మాత్రమే రోడ్లపైకి రావాలని చెబుతున్నా కొందరు ఆ నిబంధనలు పాటించడం లేదు. రోడ్లపైకి వస్తున్న వారిని పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా వారు చెప్పిన సమాధానాలు విని షాక్ అవ్వడం పోలీసుల వంతవుతోంది. 
 
ఒక వ్యక్తి పోలీసులు ఎందుకు బయటికొచ్చావని ప్రశ్నించగా కూలర్ వైర్ ఫ్రెండ్ దగ్గర ఉందని అందుకోసం వెళుతున్నానని చెప్పాడు. అదే సమయంలో మీడియా అతనిని ఎందుకు బయటికొచ్చావని ప్రశ్నించగా తమ ఇంటి దగ్గర ఉన్న ఏటీఎంలలో డబ్బులు లేవని... అందుకే బయటకు రావాల్సి వచ్చిందని మరో రీజన్ చెప్పాడు. నిమిషాల వ్యవధిలోనే వాహనదారుడు బయటకు రావడానికి రెండు వేరు వేరు కారణాలను చెప్పాడని తెలిసి పోలీసులు, మీడియా సిబ్బంది ఆశ్చ్యర్యపోయారు. 
 
 
మరో వ్యక్తి కూరగాయలు కొనుగోలు చేసే సమయం అయిపోయిన తరువాత కూరగాయల మార్కెట్ కు రాగా మీడియా అతనిని ఎందుకొచ్చావని ప్రశ్నించింది. ఆ వ్యక్తి తాను పాలకూర కోసం మార్కెట్ కు వచ్చానని... పిల్లలు పాలకూర కావాలని అడగటంతో కూరగాయలు కొనుగోలు చేసినా మరోసారి మార్కెట్ కు వచ్చానని చెప్పాడు. ప్రభుత్వం, పోలీసులు, మీడియా కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని... అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎంత చెబుతున్నా కొందరు వాహనదారులు మాత్రం నిబంధనలను లెక్క చేయకపోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: