అమ్మ ఈ సృష్టిలో గొప్ప మాట. సృష్టి కి రూపమే అమ్మ.. అమ్మ అన్న మాటలో ఏముంది గొప్పతనం..!కేవలం రెండు అక్షరాలేగా అనుకుంటారు కొంతమంది.. అమ్మ అంటేనే ఆప్యాయత, అనురాగం, మమకారం మాటల్లో చెప్పలేని ఒక అందమైన భావన. చిన్నప్పుడు మనం అన్నం తినకపోతే మనల్ని ఆడించి, ఎత్తుకుని చందమామ రావే... జాబిల్లి రావే.. కొండెక్కి రావే... అని పాట పాడి బిడ్డ ఆకలిని తీరుస్తుంది... చందమామ ఎంత పిలిచినా రాదన్న విషయం బాబు కి ఏమి తెలుసు ! కానీ అమ్మ చెప్పింది కదా అని అన్నం తినేస్తాడు..
మనకోసం మొట్టమొదటి సారి బిడ్డ ఆకలి తీరడానికి, ఎన్నో చిన్న చిన్న అబద్దాలు చేప్పేది మన అమ్మ.. ఎలాగయితేనే నా బిడ్డ అన్నం తిన్నాడు అని తను మైమరిచిపోతుంది.. తన గూర్చి ఆలోచించడమే మానేస్తుంది. సంసార సాగరంలో మునిగి పోయి తన బాధ్యతలని నెరవేరుస్తూ, ఇంటి పనులు చేస్తూ, అందరి ఆలనా పాలనా చూస్తుంది. మనల్ని ప్రేమగా అక్కున చేర్చుకొని తల నిమురుతూ నుదుట ముద్దు పెట్టుకునే అమ్మ అద్భుతమైన స్పర్శ ఎంత గొప్పది. అంతటి అనుభూతిని భావవ్యక్తీకరణ చేయడానికి మనకు ఎన్ని పదాలు వాడిన అది తక్కువే. "వీచే చల్లని గాలిలో అమ్మ పలకరింపులు, పున్నమినాటి చంద్రుని కాంతిలో అమ్మ దీవెనల వెలుగులు..
ఇలా అమ్మను వర్ణించుటకు మన భాష సరిపోవునా...!!అమ్మ ఉన్నంత కాలం తన విలువ తెలియదు, తను శాశ్వతంగా దూరమైతే తెలుస్తుంది నిజమైన ఒంటరితనం యొక్క ప్రభావం మనిషిని మనసుని ఏవిధంగా ఎంతలా దుఃఖించేలా చేస్తుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. మనం నలుగురిలో ఎలా బ్రతకాలో నేర్పిన అమ్మ పాఠాలు మర్చిపోగలమా ! అమ్మ చూపే కల్మషమెరుగని ప్రేమను ఈ లోకంలో ఎవరు చూపగలరు.. అమ్మలేని ప్రతి ఒక్కరి హృదయంలో కలిగే ఆవేదనను ఎవరు ఓదార్చగలరు..
అమ్మ ఎన్ని బాధలు, అవమానాలు పడినా తన చివరి శ్వాస వరకు కన్న బిడ్డలపై ఎనలేని మమకారం చూపుతూనే వుంటుందనేది పరమ సత్యం. అమ్మ ఒక గంభీరమైన నిరంతర ప్రవాహం. కొలవలేని లోతైన మహా సముద్రం. అమ్మ తన బిడ్డలపై స్వచ్ఛమైన చల్లనైన ప్రేమామృత వర్షం కురిపిస్తూనే వుంటుంది.. అందుకే ఎందరో మాతృమూర్తుల పాదాలకు వందనాలు సుమా.