ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు లైట్లు అన్నీ ఆఫ్ చేసి 9 నిమిషాల పాటు జ్యోతులను లేదా క్రొవ్వొత్తులను వెలిగించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. దేశం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కాదని విమర్శించారు. భారత దేశ ప్రజలకు కూడా ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని తెలిపారు. 
 
మా జీవితాలను తొమ్మిది నిమిషాల జిమ్మిక్కులకు కుదించొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇలాంటి ప్రకటనలు కాకుండా ఇప్పటివరకూ ఏ రాష్టానికి ఎంత సహాయం చేసిందో చెప్పాలని అన్నారు. ఈరోజు ప్రధాని ప్రకటన చేసిన అనంతరం అసదుద్దీన్ ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీని విమర్శించారు. ట్వీట్ లో దేశంలో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని... దేశ ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్నారని పేర్కొన్నారు. 
 
అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చెస్తున్నారు. కొందరు అసదుద్దీన్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు విమర్శలు చేస్తున్నారు. మరో ట్వీట్ లో ముస్లిం ప్రజలు ఎవరైతే కరోనా వైరస్ వల్ల చనిపోయారో వారు అమరులని పేర్కొన్నారు. కొందరు ఒక వర్గాన్ని కులాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని చావుకు కులం, మతం లేదని ఢిల్లీలోని సామూహిక మత ప్రార్థనల గురించి స్పందించారు. 
 
ఏ మతమైనా ప్రజల మరణాన్ని కోరుకోదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బీజేపీ కరోనాకు మతం రంగు పులుముతోందని విమర్శలు చేశారు. ప్రధాని మోదీ సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చినప్పటికీ దేశంలోని అనేక ఆలయాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. ఒవైసీ మోదీపై చేసిన ట్వీట్ల గురించి బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: