కరోనా వైరస్ కు పుట్టినిల్లయినా చైనా కొన్ని నెలల పాటు అల్లాడిపోయిన మాట వాస్తవమే. ఆ సమయంలో రోగులకు అత్యవసరంగా ఉపయోగించే వైద్య పరికరాలు లేక కొంత వరకూ చైనా అప్పట్లో ఇబ్బందులు పడింది. సరే అదంతా చరిత్రయిపోయిందనుకోండి అది వేరే సంగతి. వైరస్ సమస్యతో తాను పడిన ఇబ్బందులను గుర్తుంచుకున్న చైనా ఇపుడు అదే అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున వ్యాపారం చేస్తోంది. అంటే ఒకవైపు ఫుల్లుగా బిజినెస్ కు బిజినెస్ అదే సమయంలో లాభాలకు లాభాలు.
ఇంతకీ విషయం ఏమిటంటే ప్రపంచదేశాలన్నింటికీ కరోనా వైరస్ ను చైనా అంటించేసిన విషయం అందరికీ తెలిసిందే. ముందుగా తాను బాధలు పడినా ఇపుడు మాత్రం చోద్యం చూస్తోందనే ఆరోపణలను కూడా డ్రాగన్ దేశం లెక్కచేయటం లేదు. పైగా వైరస్ సంక్షోభం నుండి లాభాలను పిండుకుంటోంది. ఎలాగంటే వైరస్ నియంత్రణలో ప్రధానంగా ఉపయోగించే మాస్కులు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తో పాటు వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లను లక్షలు, కోట్లలో తయారు చేస్తోంది. తయారు చేసిన వాటిని ప్రపంచదేశాలకు అమ్మేసుకుని ఫుల్లుగా లాభాలందుకుంటోంది.
వైరస్ నియంత్రణలో ప్రధాన పాత్ర పోషించే మాస్కులను వివిధ దేశాలకు చైనా ఇప్పటి వరకు 400 కోట్లు అమ్మిందట. మాస్కులతో పాటు 16 వెంటిలేటర్లు, 28 లక్షల కోవిడ్-19 టెస్ట్ కిట్లు, కొన్ని వేల ఆక్సిజన్ సిలిండర్లు, లక్షలాది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ల ను యుద్ధ ప్రాతిపదికన తయారు చేయిస్తోంది. వీటన్నింటినీ వైరస్ భారిన పడిన దేశాలకు అమ్మేస్తోంది.