దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ కొనసాగనుందని కొందరు... లాక్ డౌన్ ఎత్తివేస్తారని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోదీ లాక్ డౌన్ ప్రకటన వల్ల దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వరకు బుకింగ్స్ రద్దయ్యాయి. కొన్ని రోజుల క్రితం రైల్వే శాఖ ఏప్రిల్ 15 నుంచి ప్రయాణికులకు టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది.
కానీ తాజాగా రైల్వే శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఇప్పటివరకూ ఏప్రిల్ 15 నుంచి 30 వరకు బుకింగ్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. వారికి డబ్బులు ఖాతాలలో జమ చేస్తామని పేర్కొంది. ఏప్రిల్ 30 తేదీ వరకు ఆన్ లైన్ బుకింగ్స్ రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతున్నాయి.
కేంద్రం కూడా ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ ఏప్రిల్ 30 వరకు బుకింగ్స్ రద్దు చేయడంతో 30 వరకు లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఒక రకంగా ప్రయాణికులకు షాక్ అనే చెప్పాలి. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిరోజు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
నిన్నటివరకు ఏపీలో 303 కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో బాధితుల సంఖ్య 304కు చేరింది. ఈరోజు గుంటూరులో 8 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలంగాణలో నిన్నటివరకు 364 కేసులు నమోదు కాగా కొత్త కేసులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.