దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రధాని మోదీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షేర్ల విలువ పడిపోవడంతో వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి. దేశంలోని వ్యాపారవేత్తలందరూ కరోనా వల్ల గతంలో ఎన్నడూ చూడని నష్టాలను చవిచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన దేశంలో సక్సెస్ అయిన ఒకే ఒక వ్యాపారి రాధాకిషన్ దమానీ.
దేశంలో కరోనా సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థ కకావికలమవుతోంది. ఇలాంటి తరుణంలో డీ మార్ట్ సూపర్ మార్కెట్ల అధినేత రాధాకిషన్ సంపద విలువ మాత్రం ఈ ఏడాది 5 శాతం పెరిగింది. రాధాకిషన్ సంపద విలువ 10.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దేశంలో ఉన్న తొలి 12 మంది అపర కుబేరుల్లో ఈ ఏడాది లాభాలు అందుకున్న ఒకే ఒక వ్యక్తి రాధాకిషన్ దమానీ కావడం గమనార్హం.
బూంబర్గ్ అనే సంస్థ డీ మార్ట్ షేర్ల విలువ ఈ సంవత్సరం గతేడాదితో పోలిస్తే 18 శాతం పెరిగినట్లు పేర్కొంది. కరోనా దెబ్బకు దేశంలో అపర కుబేరులైన ముఖేష్ అంబానీ, ఉదయ్ కోటక్ కూడా నష్టాల బాట పట్టారు. రాధా కిషన్ కు ఈ స్థాయిలో లాభాలు రావడానికి కూడా ఒక రకంగా కరోనానే కారణం కావడం గమనార్హం. ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలు అధిక మొత్తంలో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు.
అందువల్ల కంపెనీ షేర్ల విలువ గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ కరోనా వల్లే రాధాకిషన్ లాభాల బాట పట్టారని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 5000 దాటింది. మహారాష్ట్ర రాష్ట్రంలోనే 1000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నిన్నటివరకు 404 కేసులు నమోదు కాగా 12 మంది మృతి చెందారు. ఏపీలో 329 కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు.