ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ వల్ల పేద అర్చకులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో వారిని ఆదుకునే దిశగా చర్యలు చేపట్టారు.
చిన్న చిన్న దేవాలయాల్లో పని చేసే అర్చకులకు ప్రభుత్వం 5,000 రూపాయల గ్రాంట్ ఇవ్వనుంది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీఎం సూచనల మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చిన్నచిన్న దేవాలయాలు సైతం మూతబడ్డాయి. దేవాలయాలు భక్తుల రాకను పూర్తిగా నిషేధించాయి.
ధూప దీప నైవేద్యం, అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో 2800 ఆలయాలు లబ్ధి పొందుతున్నాయి. కానీ ఎటువంటి ఆదాయం లేని చిన్న దేవాలయాల అర్చకులు ఎటువంటి ప్రయోజనం పొందట్లేదు. రాష్ట్రంలో 2500 మంది అర్చకులకు జగన్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుందని తెలుస్తోంది. సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏ పథకం కింద లబ్ధి చేకూరని అర్చకులకు ప్రయోజనం కల్పించాలని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని మంత్రి చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు ఉదయం 15 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 329కు చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదు కాగా నెల్లూరు జిల్లాలో 49, గుంటూరు జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి. మరోవైపు సీఎం జగన్ రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల వల్ల రాష్ట్రంలో కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్న విషయం తెలిసిందే.