రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు ఉద్వాసన పలుకుతూ జగన్‌ సర్కార్‌ అసాధారణ నిర్ణయం తీసుకుంది. నిమ్మగడ్డను ఆ పదవి నుంచి తప్పించేలా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందనే విషయం కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.  ప్రస్తుతం కరోనా హడావుడి ఉన్న క్రమంలో ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోరని అంతా భావించారు. పైగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నందున.. అది పూర్తయ్యే వరకు ఆగుతారని భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

 

ఏపీ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అధికారం చేపట్టిన నాటి నుంచి సున్నితమైన అంశాలు.. కీలకమైన అంశాల్లో ఎవ్వరూ ఊహించని విధంగా పాలసీ డెసిషన్‌ తీసుకుంటోన్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. అదే తరహాలో మరో నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం వివాదాస్పదమైనప్పటి  నుంచి నిమ్మగడ్డను తప్పిస్తారనే ప్రచారం జోరుగానే సాగింది. అయితే ఆ తర్వాత కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో ప్రభుత్వం బిజీగా ఉండిపోయింది. దీంతో ఎస్‌ఈసీని తప్పించే అంశం తాత్కాలికంగా వాయిదా పడ్డట్టేనని అంతా భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీఎం జగన్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ నిర్వహించిన సమయంలోనే ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ తొలగింపు అంశం ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకం.. పదవి కాలం.. కొనసాగింపు.. తొలగింపు వంటి విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది ప్రభుత్వం. ఐదేళ్ల పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయడం.. దానికి గవర్నర్‌ ఆమోదం తెలపడంతో.. రమేష్‌ కుమార్‌కు ఉద్వాసన పలుకుతూ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే రమేష్‌ కుమార్‌ పదవీ కాలం పూర్తి అయినందున.. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించారనేది ప్రభుత్వ వాదన.

 

అయితే హై కోర్టు న్యాయమూర్తి సమాన హోదాలో ఉన్న ఎస్‌ఈసీ తొలగింపు అనేది ఆర్డినెన్స్‌ల వల్ల అయ్యే పని కాదని.. ఇది చట్టప్రకారం చెల్లదనే వాదన వినిపిస్తోంది. ఎస్‌ఈసీ నియామకం ఐదేళ్ల పాటు ఉంటుందని స్పష్టం చేశాక.. ఆయన్ను తొలగించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందంటున్నారు. మరోవైపు ఆర్టికల్‌ 243K, ఏపీ పంచాయతీ రాజ్‌ చట్టం సెక్షన్‌ 200 ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలంటోంది ప్రతిపక్షం. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్‌కు లేఖ రాశారు. ఆర్డినెన్స్‌ను నిలుపుదల చేసేలా గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను తప్పించడం కుదరదనే చర్చా కూడా జరుగుతోంది.

 

ఈ మొత్తం వ్యవహారాన్ని హైకోర్టులో ఛాలెంజ్‌ చేయొచ్చని.. దీనిపై స్వయంగా రమేష్‌ కుమార్‌ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఖర్చులతోనే కోర్టుకు వెళ్లొచ్చనేది కొందరు వాదన. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని పూర్తిగా సమర్ధించుకుంటోంది. తాము పూర్తిగా నిబంధనల ప్రకారమే వ్యవహరించామని.. ఎక్కడా ఉల్లంఘనలు చేయలేదనేది సర్కార్‌ పెద్దల వాదన. పైగా రమేష్‌ కుమార్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పినట్టు చేశారని.. ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలను గుప్పిస్తోంది.

 

ఇక రమేష్‌ కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించిన సర్కార్‌.. కొత్త రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరుగా ఓ రిటైర్డ్‌ న్యాయమూర్తిని  నియమించే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: