దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా గృహ హింస పెరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. రోజురోజుకు గృహ సింస, అఘాయిత్యాలకు సంబంధించిన ఘటనలు పెరిగిపోవడంతో జాతీయ మహిళా కమిషన్ ఒక వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. 
 
అమ్మాయిలు, మహిళలు ఎటువంటి సమస్యలు ఎదురైనా ఈ నంబర్ కు మెసేజ్ చేసి పరిష్కరించుకోవచ్చు. దేశవ్యాప్తంగా గృహ హింస కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నంబర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మా తెలిపారు. 7217735372 లో వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. 
 
ప్రజలు కూడా ఈ నంబర్ కు మెసేజ్ చేసి గృహ హింస కేసులకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కోరారు. ఒత్తిడిలో ఉన్న లేదా గృహ హింసకు గురైన మహిళలకు జాతీయ మహిళా కమిషన్ సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. లాక్ డౌన్ దేశవ్యాప్తంగా అమలులో ఉండటంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు. ఈ సేవ తాత్కాలిక సేవ మాత్రమేనని తెలిపారు. 
 
దేశంలో లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం ఈ నంబర్ పని చేయదని... లాక్ డౌన్ తొలగించిన వెంటనే ఈ సేవను నిలిపివేస్తామని ప్రకటన చేశారు. జాతీయ మహిళా కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశం లేదు. ప్రధాని మోదీ ఏప్రిల్ 14న లాక్ డౌన్ గురించి కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం.       

మరింత సమాచారం తెలుసుకోండి: