కరోనా ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వారంగం తీవ్రంగా నష్ట పోయింది. ప్రజారవాణా స్తంభించటంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా అక్వా రైతులు నిండా మునిగారు. ఒక్క నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు నెల్లూరు జిల్లా ఆక్వా రైతులు.
ఆక్వా రంగంలో అతి ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే జిల్లాలలో నెల్లూరు ఒకటి. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత మండలాల్లో రొయ్యల ఉత్పత్తి ఎక్కువుగా వుంది. కావలి నుంచి తడ వరకు ఉన్న సముద్ర తీర మండలాల్లోని లక్షన్నర ఎకరాలలో రోయ్యల ఉత్పత్తి సాగవుతుంది.
కావలి, దుగదర్తి, అల్లూరు, ముత్తుకూరు, తోటపల్లి గూడురు, వెంకటాచలం, కోట. వాకాడు, సూళ్ళురుపేట,ఓగోలు,తడ మండలాల్లో విస్తారంగా రొయ్యల చెరువులున్నాయి.ఇందులో సుమారు చిన్న పెద్దా కలసి పాతికవేల మంది రొయ్యల సాగులో వున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా రొయ్య పిల్లల ఉత్పత్తి చేసే హేచరీస్ 200 వరకు వున్నాయి.వీటిలో ఒక్కొక్క హేచరీస్ లో 25మంది ఉపాధి పొందుతున్నారు.ఈవిధంగా 5 వేలమందికి ఉపాధి దొరుకుతోంది.ఇందులో బడా కంపెనీలు జిల్లాలో పది వరకు వున్నాయి.పెద్ద కంపెనీలలో అయితే 200 నుంచి 500 మంది వరకు వివిధ దశలలో ఉపాధి పొందుతున్నారు.
రొయ్యల ఫీడ్ కంపెనీలు స్థానికంగా 10 వరకు వుండగా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికే దిగుమతులు అవుతుంటాయి. ఫీడ్ కంపెనీల ఏజెన్సీలు,అందులో పనిచేస్తున్న ఉద్యోగులు కలసి పది వేలమంది వుంటారు.ప్రాసెసింగ్ యూనిట్స్ 10 ఉన్నాయి.వీటిలో 15వేలమంది కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తం మీదా జిల్లాలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద ఉపాధి అక్వారంగంలోనే జరుగుతుంది.
గత రెండేళ్లుగా రొయ్యలకు వివిధ రకాల వైరస్ ల వల్ల సాగుదారులు నష్టాలలో వున్నారు. ఈ సారి వాతావరణం అనుకూలించడంతో మంచి దిగుబడులు వస్తాయని అశిస్తున్న సమయంలో, కరోనా రైతుల పాలిట శత్రువుగా మారింది.డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రొయ్యల ధర నానాటికి పడిపోతుంది.ముఖ్యంగా నెల్లూరునుంచి ఎక్కువుగా కేరళతో పాటు విదేశాలలో గల్ప్ ,చైనా ,యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.నాలుగు నెలల క్రితమే కరోనా ఎఫెక్ట్ వల్ల ధరల తగ్గదల ప్రారంభమై ఇప్పుడు పూర్తిగా పడి పోయిన పరిస్థితి నెలకొంది. 40 రొయ్యల కౌంట్ ధర కిలో 550 వరకు గతంలో వుండేది, ఇప్పుడు అది రెండు వందలకు పడిపోయింది. ఎగుమతులు అగిపోవడంతో రైతులు అయిన కాడికి అమ్మకున్నారు.కనీసం పెట్టుబడి కూడా రాని స్థితిలో అక్వా రైతులు అల్లాడుతున్నారు.
రొయ్య పిల్లల ఉత్పత్తి చేసే హేచరీస్ కూడా నష్టాలలో నడుస్తున్నాయి.జిల్లాలో రెండు వందల దాఖ హేచరీస్ చిన్న స్థాయిలో వుండగా, కోట్లలో రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసే హెచరీస్ 10 వరకు వున్నాయి.అయితే కరోనా ఎఫెక్ట్ ప్రారంభం అయినప్పటి నుంచి సగం మంది రైతులు రొయ్యల సాగును అపి వేస్తున్నారు.దీంతో ఉత్పత్తి చేసిన రొయ్యల పిల్లలను హెచరీస్ యజమానులు బయటకు పారేస్తున్నారు.
జిల్లాలో సగం హేచరీస్ ఈ మూడు నెలల్లో మూతపడే స్థాయికి చేరుకున్నాయి.పెద్ద కంపెనీలు నడుస్తున్నప్పటికి పాతికమంది ఉద్యోగులతో నడిచే హెచరీస్ మాత్రం అప్పులలో మునిగిపోయేస్థితికి చేరుకున్నాయి.కొంతమంది మూసి వేసారు.ఈ పరిస్థితుల్లో హెచరీస్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు నెలల నుంచి వేతనాలు కూడా ఇవ్వని స్థితిలో ఉన్నాయి.మరో వైపు రైతులు అప్పుగా సీడ్ తీసుకెళ్ళి, తిరిగి చెల్లించలేని స్థితిలో వున్నారు.
ఇక కొన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ సరుకు తక్కువ ధరకు వస్తుంది కదా అని, కొనుగొలు చేసి కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకుంటున్నాయి.అయితే లాక్ డౌన్ కాలం మరికొంతకాలం పొడిగిస్తారనే ప్రచారంతో వీరు వెనక్కి తగ్గారు.దీంతో చాలావరకు ప్రాసెసింగ్ యూనిట్లు మూత పడ్డాయి. ఇదే విధంగా ఫీడ్ తయారీ ప్యాక్టరీలు జిల్లాలో పది వరకు వున్నాయి.ఇక్కడ కూడా లాక్ డౌన్ తర్వాత ముడి సరుకు రాక పోవడంతో వీరి వద్ద ఉత్పత్తి అగిపోయింది.
దేశ వ్యాప్తంగా ఉన్న అక్వా ఎగుమతుల్లో 60శాతం ఏపి నుంచే వుంది.మొత్తం 45వేల కోట్ల ఎగుమతులు దేశం నుంచి జరుగుతున్నాయి. ఇందులో నెల్లూరు జిల్లా వాటా 10 వేల కోట్ల టర్నోవర్ అక్వా రంగంలో వుంది.అయితే ఇప్పుడు ఇది పూర్తిగా అగిపోయింది.ప్రభుత్వం అక్వా ఉత్పత్తుల విషయంలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికి బయటప్రాంతాలకు ఎగుమతులు అగిపోవడంతో స్థానికంగా అమ్ముకోలేని పరిస్థితి వుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా దేశానికి ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం ఆక్వా రంగం నుంచే వచ్చే అవకాశముంది.