కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం అందించే కొన్ని సేవలు, అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ అయ్యాయి. రవాణా రంగాన్ని కోలుకోకుండా దెబ్బతీసిన కరోనా అదే విధంగా హోటల్స్ రంగాన్ని కూడా దెబ్బకొట్టింది. హోటల్స్ కు తాళాలు వేసేసిన పరిస్థితులు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయి. ఇక రాజధాని బెజవాడ పరిసర ప్రాంతాల్లో హోటల్ నిర్వాహకులు కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా దెబ్బకు ఆతిథ్య రంగం  అతలాకుతలమైంది. ప్రధానంగా బెజవాడ - గుంటూరు ప్రాంతాల్లో సంక్షోభంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కు పిలుపునిచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రంగాలు మూతపడినట్టే ఆతిధ్య రంగమైన హోటల్స్ కూడా మూతపడ్డాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ ప్రకటించిన రోజు నుంచి ఇప్పటి వరకు హోటల్స్ అదే పరిస్ధితి. ఆరంభంలో కొన్ని హోటల్స్ తెరిచే ఉంచినా...ఆక్యుపెన్సీ లేకపోవటం, పోలీసులు కేసులు నమోదు చేయటం వంటివి చేయటంతో దాదాపుగా ఏపీలో అన్ని ప్రాంతాల్లో హోటల్స్ మూతపడ్డాయి.

 

రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న హోటల్స్ రంగాన్ని కరోనా కోలుకోలేని దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు.  రాజధాని ప్రాంతంలో హోటల్స్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. గత ప్రభుత్వం అమరావతి రాజధానిగా నిర్ణయించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిటంతోపాటు పెట్టుబడులు, సీఆర్డీయే ప్రణాళిక అంటూ పలు సమ్మిట్ లు నిర్వహించే వారు. దీంతో బెజవాడ - గుంటూరుల్లో ఉన్న హోటల్స్ కు ఆక్యుపెన్సీ ప్రతి రోజూ 70 శాతం ఉండేది. వైసీపీ వచ్చిన తర్వాత పాలనా వికేంద్రీకరణ మూడు రాజధానుల నినాదం, అమరావతి ఉద్యమం వంటి వాటి కారణంగా హోటల్స్ లో ఆక్యుపెన్సీ 25 నుంచి 30 శాతం మాత్రమే ఉంది.  అయినప్పటికీ నడిపిస్తున్న హోటల్స్ కు ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా కోలుకోలేని దెబ్బ తగిలినట్టైంది.

 

బెజవాడను పరిశీలిస్తే స్టార్ హోటళ్ళు 40 వరకు ఉన్నాయి. డీలక్స్ హోటళ్ళు 200 వరకు ఉన్నాయి. ఇక రెస్టారెంట్లు 200 వరకు ఉన్నాయి. ఒకరోజుకి బెజవాడలో హోటల్స్ ద్వారా ప్రస్తుతం 2 కోట్ల వరకు టర్నోవర్ ఉంది. ఇక రెస్టారెంట్లను కలుపుకుంటే ఇది రెట్టింపు ఉంటుంది. అయితే కరోనా కారణంగా మార్చి 22 నుంచి హోటల్స్ అన్నీ మూతపడ్డాయి. కొన్ని హోటల్స్ కు పోలీసులు తాళాలు వేస్తే కొన్ని హోటల్స్ కు నిర్వాహకులే తాళాలు వేసేశారు. ఇక స్థలాల లీజులు, రెంట్లు కట్టలేని పరిస్థితి కొందరిదైతే, సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని దారుణ పరిస్థితి మరికొందరిది.   లాక్ డౌన్ ఇంకా పొడిగించే అవకాశాలు ఉండటంతో నష్టాలు కొనసాగుతాయనే ఆందోళనలో హోటల్స్ నిర్వాహకులు ఉన్నారు.

 

ఆతిధ్యరంగానికి ప్రధానంగా బిజినెస్, టూరిస్ట్, క్యాపిటల్ వంటి అంశాలే కీలకం. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభన దృష్ట్యా అన్నింటికంటే కీలకమైన రవాణా రంగం స్థంభించిపోయింది. వ్యాపార లావాదేవీల కోసం ప్రాంతాలకు తిరిగే వారు కూడా లేరు. దీంతో ఆతిధ్య రంగం కూడా కుదేలైంది.  తిరిగి ఎలా కోలుకుంటామో అనే ఆందోళన  వ్యక్తమవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: