ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వల్ల అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడకుండా అత్యవసర సేవల కొరకు వెళ్లే వారి కోసం రవాణా పాసులు అందజేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పాసులు కావాలనుకునేవారు పేరు, చిరునామా, ఆధార్ కార్డ్ వివరాలు, ప్రయాణించే వాహనానికి సంబంధించిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.
ఎమర్జెన్సీ పాసులు కావాలనుకునేవారు ఆయా జిల్లా ఎస్పీల వాట్సాప్ నంబర్ లేదా మెయిల్ ఐడీలకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంగీకరించిన వారికి ఈ పాసులు వాట్సాప్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి వస్తాయి. జిల్లా ఎస్పీ వాట్సాప్ నంబర్ లేదా మెయిల్ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ప్రయాణ సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది.
పోలీస్ శాఖ చేపట్టిన ఈ పాసుల జారీ ప్రక్రియకు నిన్న భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. లాక్ డౌన్ వల్ల వేరువేరు ప్రాంతాలలో చిక్కుకుపోయినవారు.... అత్యవసరమైన పనుల వల్ల వెళ్లేవారు 14,000 మంది పాసుల కోసం దరఖాస్తు చేశారు. ఊహించని స్థాయిలో దరఖాస్తులు రావడంతో పోలీసులు వాటి పరిశీలనలో పడ్డారు. విద్యార్థులు, వ్యాపారులు, వలస కూలీలు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.
కొందరు అత్యవసరం కాకపోయినా పాసుల కోసం దరఖాస్తు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే అనుమతులు మంజూరు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నిన్న 60 మందికి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు డీజీపీ కార్యాలయం అనుమతులు ఇచ్చిందని తెలుస్తోంది.